5 percent GST if tickets are cancelled: Centre
mictv telugu

ఇకపై టికెట్లు క్యాన్సిల్ చేస్తే, 5 శాతం జీఎస్టీ: కేంద్రం

August 29, 2022

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు ప్రయాణికులు గానీ, విమాన ప్రయాణికులు గానీ, హోటల్ టిక్కెట్లు బుక్ చేసుకునేవారు గానీ.. కన్ఫామ్ అయిన టిక్కెట్లను రద్దు చేసుకుంటే క్యాన్సెలేషన్ చార్జీపై అదనంగా 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ సర్క్యూలర్ జారీ చేసింది.

ఆ సర్క్యూలర్‌లో తెలిపిన వివరాల ప్రకారం..”కన్ఫామ్ అయిన రైలు, హోటల్ టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసేందుకు క్యాన్సెలేషన్ చార్జీపై అదనంగా 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. విమాన ప్రయాణం, హోటల్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసినా, ఐదు శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వర్తించే జీఎస్టీ రేటునే రద్దు చేసుకున్నప్పుడు కూడా చెల్లించాలి. క్యాన్సెలేషన్ ఫీజు అనేది ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా జరిగే చెల్లింపు. కాబట్టి దానిపై జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు, సర్వీస్ ప్రొవైడర్‌కు చిన్న మొత్తంలో పరిహారం చెల్లించాలి. దీన్ని క్యాన్సెలేషన్ చార్జీగా వసూలు చేస్తాం. క్యాన్సెలేషన్ చార్జీ అనేది ఒప్పందాన్ని ఉల్లంఘించడం కాదు. అది ఒక పేమెంట్ మాత్రమే. కాబట్టి దానికి జీఎస్టీ వర్తిస్తుంది” అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం రైల్వే ప్రయాణాల్లో ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ టిక్కెట్ల బుకింక్స్ పైనే ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. సెకండ్ క్లాస్, ఇతర తరగతులకు జీఎస్టీ లేదు. కాబట్టి, ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్‌ల టిక్కెట్లు రద్దు చేస్తేనే..క్యాన్సెలేషన్ ఫీజుపై అదనంగా జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సెకండ్ క్లాస్, ఇతర తరగతుల టిక్కెట్లు రద్దు చేసుకుంటే జీఎస్టీ విధింపు ఉండదు. ప్రస్తుతం రైలు బయలుదేరడానికి 48 గంటలు లేదా అంతకంటే ముందు టికెట్ రద్దు చేసినప్పుడు క్యాన్సెలేషన్ ఫీజుగా రూ. 240 వసూలు చేస్తున్నారు. రైలు బయలుదేరడానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు రద్దు చేసినట్లయితే, టిక్కెట్ మొత్తంలో 25 శాతం రుసుమును క్యాన్సెలేషన్ ఫీజుగా వసూలు చేస్తారు.