50 lakh defamation suit of friends against the groom
mictv telugu

వరుడిపై స్నేహితుల 50 లక్షల పరువునష్టం దావా.. అవమానంతో రగిలిపోయారు

June 28, 2022

పెళ్లికి పిలిచిన వరుడిపై అతడి స్నేహితులు పరువు నష్టం దావా వేశారు. పిలిచి అవమానించాడని ఆగ్రహించి కోర్టులో 50 లక్షలకు దావా వేశారు. నిజంగా జరిగిన ఈ సంఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరిగింది. వివరాలు.. బహదూరాబాద్ గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తికి ఇటీవల పెళ్లి జరుగగా, స్నేహితులను పెళ్లి వేడుకకు ఆహ్వానించాడు. పెళ్లి రోజున సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపుగా బయల్దేరతామని, అందరూ తప్పక పాల్గొనాలని ఆహ్వన పత్రికలు పంపాడు. అక్కడే అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పాడు. అనుకున్న సమయానికే స్నేహితులు అందరూ కలిసి వరుడు చెప్పిన ప్రదేశానికి రాగా, అప్పటికే వరుడు ఊరేగింపుగా వధువు ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో వరుడికి స్నేహితులు ఫోన్ చేసి విషయం చెప్పగా, కార్యక్రమం అయిపోయిందని, అందరూ తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోవాలని సూచించడంతో స్నేహితులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే లాయర్‌ను కలిసి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన స్నేహితుడిపై రూ. 50 లక్షలకు పరువు నష్టం దావా వేశారు. తమను మానసికంగా హింసించాడని ఆరోపించారు. అయితే తాను చెప్పిన సమయానికి స్నేహితులు రానందున కార్యక్రమం మొదలుపెట్టేశానని వరుడు వివరిస్తున్నాడు. కాగా, చిత్రంగా అనిపించే ఈ సంఘటన గురించి స్థానికులు చర్చించుకుంటున్నారు.