నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు హుష్.. - MicTv.in - Telugu News
mictv telugu

నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు హుష్..

April 17, 2019

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు వల్ల దేశంలో పలువురు ఉపాధి కోల్పోయారని, వ్యాపారాలు కూడా మందగించాయని ఇప్పటికే పలు నివేదికలు తేల్చాయి. తాజాగా మరో షాకింగ్ నివేదిక బయటికొచ్చింది. 2016 నుంచి 2018 మధ్య.. అంటే నోటర్ల రద్దు ప్రభావం మొదలై, అది తీవ్రంగా కొనసాగిన కాలంలో దేశంలో 50 లక్షల మంది ఉద్యోగాలు పోయినట్లు వెల్లడైంది. నోట్ల రద్దు జరిగిన 2016 నవంబర్ నుంచే కొలువులకు భారీగా గండిపడినట్లు తేలింది.

50 Lakh People Have Lost Their Jobs Since the Demonetisation Exercise, Says Report.

అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ  ‘ద స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2019’ పేరుతో రూపొందించిన నివేదికలోని వివరాల ప్రకారం.. మన దేశంలో 2011 నుంచి దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గాయి. ఇదే సమయంలో నోట్ల రద్దు జరిగింది. 2000 నుంచి 2011 మధ్య 3 శాతంగా ఉన్న నిరుద్యోగిత 2018లో 6 శాతానికి అంటే రెట్టింపైంది. ఉద్యోగాలు పోయిన వారిలో ఉన్నత విద్యావంతులే ఎక్కువ మంది ఉన్నారు. 20-24 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో నిరుద్యోగిత ఎక్కువగా నమోదవుతోంది. ఈ వయసున్న పట్టణ యువకుల్లో 60 శాతం నిరుద్యోగిత నమోదైంది. ఉన్నత విద్యనభ్యసించిన గ్రామీణ యువకుల్లో 20% నిరుద్యోగులుగా ఉన్నారు. గత రెండేళ్ల కాలంలో ఉన్నత విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కూడా భారీగా తగ్గాయి. 2017-18లో దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ళ గరిష్ఠ స్థాయి 6.1 శాతానికి చేరింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ద ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) పిరమిడ్స్‌ ఆఫ్‌ సర్వేలోని డేటా ఆధారంగా నివేదిక రూపొందించారు. నోట్ల రద్దుకు, నిరుద్యోగానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నా, లేకపోయినా.. ఈ రెండు యాదృచ్ఛిగంగా జరిగాయి.