ఏపీలో అధికారుల నిర్వాకం.. ఒక్కరోజులో 50 లక్షలు ఖర్చు చేయాలి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో అధికారుల నిర్వాకం.. ఒక్కరోజులో 50 లక్షలు ఖర్చు చేయాలి

March 30, 2022

money

లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం ఉన్న నిధులను చాలా జాగ్రత్తగా ఖర్చుచేయాలి. కానీ, ఏపీలో అధికారుల నిర్వాకం వల్ల నిధులను దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో డిపార్ట్‌మెంటుకు కేటాయించిన నిధులను ఖర్చుచేయమని కింది స్థాయి సిబ్బంది మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ సంఘటన రజనీకాంత్ సినిమా అరుణాచలాన్ని తలపిస్తోంది. వివరాల్లోకెళితే.. ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి అనంతపురం ఐసీడీఎస్ అకౌంటుకు రూ. 50 లక్షలు వచ్చాయి. మార్చి 31 లోపు వాటిని ఖర్చు పెట్టి, అందుకు సంబంధించిన బిల్లులను సమర్పించాలని పై అధికారులు ఆదేశించారు. దీంతో జిల్లా అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఒక్క రోజులో అంత డబ్బు దేనిపై ఖర్చు పెట్టాలో తెలియక మల్లగుల్లాలు పడ్డారు. అలాగని ఎలా పడితే అలా ఖర్చు చేయడానికి కుదరదు. అన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలి. లేదంటే ప్రభుత్వ నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. ఈ నేపథ్యంలో ఏం కొనాలి? ఎంత కొనాలి? వంటి చర్చ ఆ శాఖ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. ఆఫీసుకు కావాల్సిన వస్తువులు ముందుగా కొనాలని లిస్టు తయారు చేసుకుంటున్నారు. అయితే కొందరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఏడాది మొదలు నుంచి ఏమీ ఇవ్వకుండా, ఏడాది చివర్లో డబ్బిచ్చి ఖర్చు చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.