50 LSD slots seized in Visakhapatnam, five held
mictv telugu

విశాఖలో డ్రగ్స్ కలకలం.. గోవా నుంచి కొనుగోలు.. ఐదుగురి అరెస్ట్

August 7, 2022

విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 ఎల్ఎస్ డీ బ్లాట్స్, 5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

సిటీ టాస్క్ ఫోర్స్‌, యాంటీ నార్కోటిక్స్ సెల్, లా అండ్‌ ఆర్డర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ డ్రగ్ రాకెట్‌ను పట్టుకున్నారు. ఈ కేసులో విశాఖకు చెందిన వాసుదేవ, మోజెస్, రవికుమార్, కిశోర్, బెంగళూరుకు చెందిన సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్, ఐదు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో దిలీప్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులు క్రిప్టో కరెన్సీ ద్వారా బ్లాట్స్‌ డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ను గోవా నుంచి తీసుకొచ్చి విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని యువకులకు అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని పట్టుకోవాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌ను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసి విడతల వారిగా రెండింతలకు విక్రయించే ముఠాలోని ఐదుగురిని పట్టుకున్నామన్నారు. కేసులో మరికొంతమంది ఉన్నట్లు గుర్తించామని, వారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. నిందితులు డ్రగ్స్ ను తీసుకొచ్చి ఏయే ప్రాంతాల్లో ఎవరెవరికి అమ్ముతున్నారు? నిందితుల వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.