ఊరిలో పెళ్లి.. 500 కుక్కలకు భోజనాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఊరిలో పెళ్లి.. 500 కుక్కలకు భోజనాలు

October 13, 2020

500 dogs invited for wedding.jp

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అనే సామెతను అందరూ వినే ఉంటారు. బహుశా ఎవ్వరూ చూసి ఉండరు. కానీ, ఒడిశాకు చెందిన ఓ జంట ఈ సామెతను నిజం చేసింది. తమ పెళ్ళికి బంధువులతో పాటు 500 వీధి కుక్కలను ఆహ్వానించింది. అందరితో పాటు వాటికి కూడా భోజనం పెట్టి పెద్ద మనుసు చాటుకుంది. ఆ దంపతులే ఫిలిమ్ మేకర్‌గా పనిచేస్తున్న యురేకా ఆప్టా, డెంటిస్ట్ వృత్తిలో ఉన్న జోవన్న వాంగ్ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ దేవాలయంలో తక్కువ మంది అతిధుల మధ్య పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తంతు ముగిసిన తరువాత నగరంలోని అనిమల్ వెల్ ఫేర్ ట్రస్ట్ ఏకమ్ర(ఏడబ్ల్యూటిఈ) అనే స్వచ్చంద సంస్థకు వెళ్లారు. అక్కడ ఉన్న 500 వీధి కుక్కలకు భోజనం పెట్టించారు. దీని గురించి నవవరుడు వాంగ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో మా స్నేహితుడు యాక్సిడెంట్ అయిన కుక్కను కాపాడాడు. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ కుక్కకు వైద్యం చేయించిన తరువాత దాని సంరక్షణ బాధ్యతలను ఏడబ్ల్యూటిఈకి అప్పగించాము. అప్పుడు నేను ఏడబ్ల్యూటిఈ వీధి కుక్కల కోసం ఏర్పాటు చేసిన డాగ్ షెల్టర్‌ను పరిశీలించాను. 

యురేకాను కూడా తీసుకెళ్లి ఆ డాగ్ షెల్టర్‌ను చూపించాను. అప్పడు వాటి కోసం ఏదైనా చేయాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ఇంట్లో పెంచుకునే కుక్కల ఆలనా పాలనా వాటి యజమానులు చూసుకుంటారు. వాటికీ సమయానికి భోజనం పెడతారు. అనారోగ్యం వస్తే వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. కానీ, వీధి కుక్కలను ఎవ్వరూ పట్టించుకోరు. కొందరు పెద్ద మనసుతో వాటి కోసం షెల్టర్‌లను ఏర్పాటు చేస్తారు. మాకు అంత స్తొమత లేదు. అయినా వీధి కుక్కల కోసం ఏదైనా చేయాలి అనుకున్నాం. అందుకే ఇలా మా పెళ్లి రోజున వాటికి విందు ఏర్పాటు చేశాం. ఈ పెళ్లి రోజు మాకు ఎంతో ప్రత్యేకం అని తెలిపాడు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగా జీవులపై వీరు చూపిన నిస్వార్ధ సేవకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజంగా మీ ఆలోచన చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు. కొందరు పెళ్లి భోజనాల దగ్గరికి కుక్కలను రానివ్వరు అలాంటిది మీరు కుక్కలకే పెళ్లి భోజనం పెట్టారు. మీరు నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.