చరిత్రలో, కథల్లో ఎందరో అమర ప్రేమికులు ఉన్నారు. లైజా మజ్నూ, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలీ.. మరెందరో. సఫలమైన ప్రేమల కంటే విఫలమైన ప్రేమలే చరిత్రలో బాగా నిలిచిపోయాయి. ప్రేమ కోసం కులమతాలను, ఆస్తులు అంతస్తులను అన్నిటినీ ధిక్కరించిన అలాంటి వారి గురించి ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. మన తెలుగు నేలలోనూ అలాంటి అమర ప్రేమికుల జంట ఒకటి ఉంది. బతికి ఉన్నప్పుడు కాదు, చనిపోయి 500 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ప్రేమ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు.
పాలెగాళ్ల సీమలో..
ప్రచారంలో ఉన్న కథల ప్రకారం.. నేటి అనంతపురం జిల్లాలోని కదిరిలో జరిగిందీ ప్రేమకథ. పట్టణానికి దగ్గర్లోని పాతర్ల పట్నాన్ని 500 ఏళ్ల కిందట శ్రీరంగరాయలు అనే పాలెగాడు పరిపాలిస్తుండేవాడు. అతనికి చంద్రవదన అనే కూతురు ఉండేది. ఆమెను చంద్రమ్మ అని కూడా పిలిచేవారు. కదిరిలో కొలువైన నరసింహిస్వామికి వీరు అపర భక్తులు. చంద్రమ్మ మహా అందగత్తె. నరసింహ ఆలయానికి వెళ్తుంటే జనం కళ్లప్పగించి చూసేవారు. ఓ రోజు అరేబియా నుంచి వచ్చిన మోహియర్ అనే ముస్లిం యాత్రికుడు కూడా గుడి దగ్గర ఆమెను చూశాడు. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. చంద్రమ్మ కూడా అతణ్ని ఇష్టపడింది. మతాలు వేరు కావడంతో ప్రేమ ఫలించే అవకాశం లేదు. మోహియర్ చంద్రమ్మను తలచుకుంటూ నిద్రాహారాలు మాని చిక్కి శల్యమై చనిపోయాడు. అంత్యక్రియల కోసం అతని శవపేటికను పైకి లేపడానికి ప్రయత్నించగా కదలనే లేదు. ఎంతో మంది కలసి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి చంద్రమ్మ చేయిపట్టగానే పైకి లేచింది. అయితే చంద్రమ్మ ఆ శవపేటికు అతుక్కుపోయి ప్రాణం విడిచింది. ఇద్దరీ ఒకే పేటికలో ఉంచి ఖననం చేశారు.
ఎగిరి వెళ్లిన శవపేటిక..
ఇంకో కథనం ప్రకారం… మోహియార్ శవపేటిక పాతర్లపట్నంలోని చంద్రమ్మ ఇంటికి గాలిలో ఎగురుతూ వెళ్లి గడపకు ఆనుకుంది. అక్కడి నుంచి తీసేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గుర్రాలతో, ఏనుగులతో లాగించినా కదల్లేదు. దీంతో చంద్రమ్మ ఆ శవపేటిక పక్కన పడుకుని చనిపోతుంది. ఇద్దరి మతాలు వేరు కాబట్టి వేరు చేసి విడివిడిగా అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ విడదీయడం సాధ్యం కాదు. రంపాలతో కోసినా ఫలితం లేకపోతుంది. దీంతో చంద్రమ్మను కూడా ఆ శవపేటికలోనే ఉంచి ఖననం చేస్తారు.
మట్టి కలుపుని తాగితే..
మోహియార్, చంద్రమ్మ సమాధులను హిందువులు, ముస్లింలు భక్తితో పూజిస్తుంటారు. విభేదాలు ఉన్న భార్యాభర్తలు అక్కడి మట్టిని నీటిలో కలుపుకుని తాగితే కలిసిమెలసి ఉంటారని భక్తుల నమ్మకం.