54 శాతం భారతీయులు వీటిపైనే ఆధారపడుతున్నారు: ఆక్స్‌ఫర్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

54 శాతం భారతీయులు వీటిపైనే ఆధారపడుతున్నారు: ఆక్స్‌ఫర్డ్

June 29, 2022

ప్రముఖ యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్ ‘ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్’ పేరుతో తాజాగా నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైన పలు సంచలన విషయాలను తెలియజేసింది. భారతదేశంలో 54 శాతం మంది సామాజిక మాధ్యమాలు అయిన ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లపైనే ఆధారపడుతున్నారని పేర్కొంది. ”సాధారణంగా మనకు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే పత్రికలు లేదా ఇతర సంప్రదాయ మార్గాలపై ఆధారపడతాం. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్నే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఈ సంఖ్య అధికంగా భారతదేశంలోనే ఉంది. భారత్‌లో కచ్చితమైన సమాచారం తెలుసుకొనేందుకు 54% మంది ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు” అని అంతర్జాతీయ సర్వేలో తేలినట్లు పేర్కొన్నారు.

ఇక, మెక్సికో, దక్షిణాఫ్రికాలో 43 శాతంగా, బ్రిటన్‌లో కేవలం 16 శాతంగా ప్రజలు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నట్లు తమ సర్వేలో తేలిందని అన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే, సామాజిక మాధ్యమాల్లో తాము చదివిన, పంచుకున్న సమాచారం నిజమేనని 87% భారతీయులు నమ్మారని వెల్లడించారు.

‘సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా 67% మంది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌పై ఆధారపడుతున్నారు. నిజానిజాల నిర్ధారణకు 52 శాతం మంది ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పుస్తకాలు, ఇతర సంప్రదాయ పద్ధతుల ద్వారా వాస్తవాలను రూఢీ చేసుకోవడం తగ్గిపోతోంది. ముఖ్యంగా యువకులు సామాజిక మాధ్యమాల్లో వచ్చిందే నిజమని నమ్ముతున్నారు. 25 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉన్నవారు 44 శాతం మంది ఎక్కువగా సోషల్ మీడియానే నమ్ముతున్నామని అన్నారు. భారత్‌లో 90 శాతం మంది తల్లిదండ్రులైతే తమ చిన్నారులకు ఏదైనా విషయం వివరించేటప్పుడు వాట్సప్, తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అంశాలనే ఉదాహరణలుగా చూపుతున్నారు.”