అరబ్ దేశాల్లో భిక్షాటన నేరం. ఎవరైనా బిక్షాటన చేస్తూ పోలీసులకు దొరికితే అరెస్ట్ చేస్తారు. ఇటీవల అజ్మన్లోని అల్ నుయిమియా ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మహిళా పోలీస్ అధికారిణికి ఓ 54 ఏళ్ళ అరబ్ మహిళ బిక్షాటన చేస్తూ కనిపించింది. దీంతో యాంటీ బెగ్గింగ్ డ్రైవ్లో భాగంగా పోలీసుల ప్రోటోకాల్ ప్రకారం బిచ్చగత్తేను ఐడీ చూపించాలని కోరింది.
అయితే తన వద్ద ఎలాంటి ఐడీలు లేవని, ఏం చేసుకుంటారో చేసుకోమంటూ పోలీస్ అధికారిణిపై దురుసుగా ప్రవర్తించింది. పోలీస్ ఆఫీసర్పై దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని తాజాగా అజ్మన్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో తాను పోలీస్ ఆఫీసర్పై దాడి చేయలేదని బుకాయించింది. దాంతో పోలీసులు అధికారిణిపై దాడి జరిగి గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన మెడికల్ రిపోర్టును కోర్టు ముందు ఉంచారు. దీంతో కోర్టు బిచ్చగత్తేను దోషిగా తేల్చింది. తరువాత ఆమెకు 4 నెలల జైలుతో పాటు దేశ బహిష్కరణ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.