56 years old Chennai woman lifts 100kg weights
mictv telugu

చీరకట్టులో జిమ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది!

November 24, 2022

చెన్నైకి చెందిన 56 యేండ్ల మహిళ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. మహిళలు వారి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని ఎలా ఫిట్గా ఉండాలో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. 56 యేండ్ల వయయసులో చిన్న వస్తువులను ఎత్తడానికి ఎవరైనా ఆలోచిస్తారు. కానీ చీర కట్టుకొని బరువులు ఎత్తుతూ వయసు కేవలం ఒక సంఖ్య అని నిరూపిస్తున్నది. నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్య సమస్యల కారణంగా జిమ్లో చేరింది.

జిమ్ డ్రెస్లు వేసుకోవడం ఇష్టం లేక చీరలోనే జిమ్ చేయడం ప్రారంభించింది. ఈమె కథనాన్ని మొదట హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్ అనే సోషల్ మీడియా పేజీ షేర్ చేసింది. అందులో ఆమె పేరును వెల్లడించలేదు. ఆమె వయసు 56…ఆమె చీర కట్టుకుని పవర్‌లిఫ్టింగ్, పుషప్‌లు చేస్తుంది. వయసు అనేది కేవలం ఒక సంఖ్య. ఆమె తీవ్రమైన మోకాలి, కాళ్ళ నొప్పులను ఎదుర్కొంది. ఆ నొప్పులు భరించలేక ఎంతోమంది వైద్యులను కలిసింది.

అన్ని రకాల చికిత్సా పద్ధతులను చేయించుకుంది. నొప్పి కొద్దిగ కూడా తగ్గలేదు. దీంతో తన కొడుకు.. కోడలితో కలిసి జిమ్కి వెళ్లమని సలహా ఇచ్చాడు. అలా.. చిన్నచిన్న వ్యాయామాలతో ఆమె జిమ్ ప్రస్థానం మొదలైంది. అప్పుడప్పుడు బరువులు ఎత్తడం ప్రారంభించింది. త్వరలోనే నొప్పి తగ్గడం గమనించింది. ఐదు నెలల్లోనే నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు ఇప్పుడు ఏకంగా 100 కేజీలను అలవోకగా ఎత్తేస్తున్నది. ఫిట్‌గా ఉండటం ఇప్పుడు ఆమె దినచర్యలో అంతర్భాగం అయింది. ఆమె అనుభవించిన బాధాకరమైన అనుభవం ఆమె కొడుకును స్వంత జిమ్‌ను ప్రారంభించేలా ప్రేరేపించింది. ఇప్పుడ సొంత జిమ్లో ఆ తల్లి వ్యాయామం చేస్తున్నది. తనకి తీరిక దొరికినప్పుడల్లా చిన్నచిన్న వ్యాయామాలు చేస్తూనే ఉంటుంది.

ఆమె వ్యాయామ వీడియోను జిమ్ సిబ్బంది పోస్ట్ చేశారు. ఆ వీడియోకి లక్షకు పైగా లైక్లు వచ్చాయి. కొన్ని చానెల్స్ వచ్చి ఆమెను ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాయి. త్వరలోనే.. తను చీర కట్టుకొని పవర్ లిఫ్టింగ్ పోటీకి వెళ్తానని చెబుతున్నది. ఆమె వీడియోకి చాలామంది పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. కొందరైతే.. ‘చీర కట్టి జిమ్ వెళ్లాలంటే ఆలోచించే వాళ్లు.. కానీ ఈ ఆంటీని చూశాక మేం కూడా అలాగే వెళ్లాలని నిర్ణయించుకుంటున్నాం’ అంటూ కామెంటుతున్నారు.