సైన్యంలోకి 575 మంది జమ్మూకశ్మీర్ యువకులు
జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి చెందిన 575 మంది యువకులు భారత సైన్యంలో చేరడం ఆసక్తికరంగా మారింది. జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలోకి ఈరోజు వీరిని తీసుకున్నారు.
శ్రీనగర్‌లో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో వీరు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులు మాట్లాడుతూ, మాతృదేశానికి సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విధుల్లో భాగంగా ప్రాణాలను అర్పించేందుకు కూడా సిద్ధమేనన్నారు. భారత సైన్యంలో భాగస్వాములు కావడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీని 1947లో ఏర్పాటు చేశారు. సరిహద్దు దేశాల నుంచి చొరబడేవారిని నిలువరించే పని ఈ విభాగం చేస్తుంది. కాగా, జమ్మూకశ్మీర్ యువత సైన్యంలో చేరడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.