5,885 మంది జాతీయ జెండాలా మారిపోయారు.. గిన్నిస్ రికార్డ్.. - MicTv.in - Telugu News
mictv telugu

5,885 మంది జాతీయ జెండాలా మారిపోయారు.. గిన్నిస్ రికార్డ్..

August 13, 2022

Chandigarh registers name in Guinness World Record for largest human chain forming Tiranga

ఆగస్టు 15న భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యావత్ దేశ ప్రజలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో తమదైన రీతిలో వేడుకలు జరుపుకుంటున్నారు. కొంతమంది ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంటే, మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాగా, చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థులు, NID ఫౌండేషన్‌కి చెందిన వలంటీర్లు కలిసి మానవ నిర్మితంగా జెండా రూపంలో నిలబడి అతిపెద్ద ఫ్లాగ్ని ఆవిష్కరించారు. 16 ఎకరాల క్రికెట్‌ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ప్రధాని పిలుపుతో.. హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని పురస్కరించుకుని చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థులు ఎన్‌ఐడి ఫౌండేషన్‌తో కలిసి రెపరెపలాడే జెండా మాదిరిగా మారి ప్రపంచ రికార్డు సృష్టించారు. చండీగఢ్ సెక్టార్ 16లోని క్రికెట్ స్టేడియంలో ఈ ఘనత సాధించారు. కాగా, ఈ పొటోలను కేంద్ర విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తన ట్విట్టర్లో షేర్ చేశారు. “భారతదేశానికి గర్వకారణం. చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో గౌరవ గవర్నర్ ష్ బన్వరీలాల్ పురోహిత్ జీ సమక్షంలో జెండా ఊపడం ద్వారా భారతదేశం గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించినందుకు సంతోషిస్తున్నాము” అని లేఖి ఆ పోస్టులో పేర్కొన్నారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రధాన ఈవెంట్‌కు ముందు సన్నాహాల ఫోటోలను కూడా షేర్ చేసింది.

వరల్డ్ డేటా ఎడ్యుకేటర్ స్వప్నిల్ దంగరికర్ దీని గురించి మాట్లాడుతూ.. గతంలో ఈ రికార్డు అబుదాబిలో GEMS స్కూల్ సాధించారని చెప్పారు. UAEలో 2017లో 4130 మందితో ఆ దేశ జెండా రెపరెపలాడించారని వివరించారు. ఆ రికార్డును చండీగఢ్ కాలేజ్ విద్యార్థులు తిరగరాశారని తెలిపారు. 5,885 మంది చిన్నపిల్లలు, యువతీ,యువకులు ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ పిక్చర్ ఆఫ్ ఎ వేవింగ్ నేషన్‌వైడ్ ఫ్లాగ్‌ను రూపొందించారని పేర్కొన్నారు.