5G services launched for Diwali: Mukesh Ambani
mictv telugu

దీపావళి నాటికి 5జీ.. ముందుగా ఆ 4 నగరాల్లో : ముఖేశ్ అంబానీ

August 29, 2022

వచ్చే దీపావళి పండుగ టపాసులతో పాటు రిలయన్స్ 5జీతో టెలికాం ఇండస్ట్రీ జిగేల్‌మనబోతోంది. భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఆ రోజు నుంచే దేశంలో 5జీ సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. సోమవారం సంస్థ 45వ ఏజీఎం సందర్భంగా అంబానీ ఈ మేరకు ప్రకటించారు. ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. డిసెంబర్ 2023 కల్లా దేశమంతా హైక్వాలిటీ 5జీ సేవలను ప్రజలకు అందిస్తామని, ఇందుకోసం రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్టు వివరించారు. ఎలాంటి వైర్లు, తీగలు లేకుండా అందించే ఈ సేవలకు జియో ఎయిర్ ఫైబర్‌గా నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. 5జీ సేవలందించేందుకు మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు విశదీకరించారు. అలాగే అంబానీ మరో కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి జియో బాధ్యతలను ఆకాశ్ అంబానీ, రిలయన్స్ రిటైల్ ఇషా అంబానీ, రిలయన్స్ న్యూ ఎనర్జీ అనంత్ అంబానీ చూసుకుంటారని వారసులకు బాధ్యతలు అప్పగించారు. అలాగే సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షలుగా ఉన్నట్టు తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో రిలయన్స్ చెల్లించిన పన్నుల విలువ 38 శాతం పెరిగి రూ. 1.88 లక్షల కోట్లకు చేరిందని స్పష్టం చేశారు.