ఆ ఆరు రోజులు బ్యాంకులు బంద్..ఇప్పుడే ప్లాన్ చేసుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఆరు రోజులు బ్యాంకులు బంద్..ఇప్పుడే ప్లాన్ చేసుకోండి

February 22, 2020

6 Day Banks Bandh in March

దేశవ్యాప్తంగా ఏకంగా ఆరు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె,పండగ సెలవుల నేపథ్యంలో మార్చి నెలలో ఈ అసౌకర్యం తప్పేలా లేదు. మార్చి 10 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు వచ్చాయి. ఇలా ఒకేసారి బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఖాతాదారులు అసౌకర్యానికి గురి కావాల్సిందే. దీంతో ముందు జాగ్రత్తగా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

వేతనాలు పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి.మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహించనున్నారు.మార్చి 10 వ తేదీన హోలీ కావడంతో ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక మార్చి 14 రెండవ శనివారం, మార్చి 15 ఆదివారం కారణంగా వరుసగా ఆరు రోజులు బ్యాంకు మూతపడనున్నాయి. 

కాగా 20 శాతం వేతనాలు పెంచాలని చాల రోజులుగా బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే యజామాన్యాలు మాత్రం 12.5 శాతం పెంచుతామని చెబుతున్నాయి. దీనిపై  కేంద్ర లేబర్ కమిషనర్ వద్ద మరోసారి చర్చలు జరగాల్సి ఉంది. ఒకవేళ ఈ చర్చలు సఫలం అయితే మాత్రం సమ్మె ఉండదు. దీని వల్ల ఖాతాదారులకు ఊరట కలిగినట్టే.