6 Herbs you can grow at your home easily
mictv telugu

ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోండి!

January 6, 2023

వంటకు కావాల్సిన అన్ని దినుసులను బయట నుంచి తేవాలి. అలా కాకుండా ఇంటి గార్డెన్ లోనే పెంచి వేసుకోవచ్చు. వీటికోసం మీరు పెద్దగా శ్రమ తీసుకోవాల్సిన పని కూడా లేదు.
ఇంట్లో మొక్కలు పెంచుకోవడం సర్వసాధారణం. అవి వంటింటికి పనికొచ్చేలా ఉంటే మరింత మంచిది. దీన్ని కిచెన్ గార్డెన్ లేదా హెర్బ్ గార్డెన్ అని పిలుస్తారు. ఫ్రెష్ గా మొక్కల నుంచి తీసి వేస్తే వంటకు ఘుమఘుమలలాంటి వాసన వస్తుంది. పైగా పోషకాలు కూడా బోలెడు లభిస్తాయి. మరి ఎలాంటి మొక్కలు పెంచుకోవాలో చదువండి.

కొత్తిమీర
ప్రతి వంటగదిలో ఉండాల్సినది. ఇది లేకుండా ఆహారం రుచిగా ఉండదు. అందుకే తాజా కొత్తిమీర వేస్తే ఆహారానికి మరింత రుచి అందుతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక కుండను తీసుకోండి. అందులో సగం వరకు మట్టిని నింపండి. ఆ తర్వాత ధనియాలను ఆ మట్టిలో వేయాలి. అప్పుడప్పుడూ కొన్ని నీళ్లు పోయాలి. వీటికి ఎక్కువ నీరు పట్టకూడదు. త్వరలోనే మీరు కొత్తిమీర రెమ్మలను చూస్తారు.

పుదీనా
ఎఫ్పుడైనా మార్కెట్ నుంచి వేరు ఉన్న పుదీనా కొన్నారా? అయితే వాటినే మీరు మొక్కలుగా నాటొచ్చు. దీనికి నేల తడిగా ఉంటే చాలు త్వరగా మొలకెత్తుతుంది. ఈ మొక్కలు ఉండడం వల్ల మీ ఇల్లు కూడా రిఫ్రెష్ గా ఉంటుంది. ఈ ఆకులు కేవలం వంటకాలకే కాదు.. పచ్చిగా నాలుగు ఆకులు నోట్లో వేసుకున్నా మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది.

తులసి
ప్రతీ భారతీయ ఇంట్లో కనిపించే పవిత్రమైన మొక్క ఇది. దీనికి చాలా సూర్యరశ్మి, నీరు అవసరం. ఆకులు కారంగా ఉండే రుచిని కలిగి ఉంటాయి. మీ టీ రుచిగా ఉండడానికి, గొంతు ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గులను నయం చేయడానికి తులసి ఆకులను ఉపయోగించవచ్చు. అలాగే పురుగులు కుట్టిన చోట ఈ ఆకును చూర్ణం చేసి పెడితే మంచిది.

కరివేపాకు
కూరల్లో కరివేపాకులా తీసేయొద్దు అంటుంటారు. అలాగే ఈ మొక్కను పెంచకుండా ఉండేరు. ఈ మొక్కకు కొద్దిగా స్థలం అవసరం. బయట గార్డెన్ లో పెంచితే మరింత మంచిది. దీనికి సూర్యరశ్మి పుష్కలంగా అవసరం. చారుల్లో, కూరల్లో తప్పనిసరిగా వాడుతాం. జుట్టు పోషణకు, కళ్లకు ఇది చాలా మంచిది.

అజ్వైన్
ఈ మొక్కను పెంచడం సులభం. దీనికి ఎక్కువ సూర్యకాంతి, నీరు అవసరం లేదు. అజ్వైన్ ఆకులతో ఉన్న వాము మొక్క కాండంను నేరుగా కుండీలో నాటి, రోజూ కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. కొద్దిరోజుల్లో ఆ మొక్క పెద్దగా పెరుగుతుంది. ఈ మొక్కలు తినవచ్చు. ఇది కడుపునొప్పికి మంచి ఔషధంలా పని చేస్తుంది. రైతాలో, సలాడ్ ల్లో చల్లుకోవచ్చు.

మిర్చి
మిరపకాయను మీ ఇంట్లోనే చాలా సులభంగా పండించొచ్చు. ఎండు మిరపకాయను తీసుకొని విరిచేయండి. దాని ఎండిన గింజలను తీసుకొని మట్టిలో వేయాలి. చిన్న ఆకుపచ్చ, ఎర్ర మిరపకాయలు పెరుగడం చూడవచ్చు. మిరప వేడి, నీటిని సమానంగా ఇష్టపడతాయి. అందుకే వీటిని సూర్యరశ్మి తగిలే స్థలంలో పెంచడం ఉత్తమం.