కుప్పకూలిన హెలికాప్టర్.. కేదార్‌నాథ్ యాత్రికులు మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. ఫటా హెలిప్యాడ్ నుంచి యాత్రికులను తీసుకెళ్తుండగా.. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ్ ఛాటి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆరు మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కాగా.. నలుగురు యాత్రికులని అధికారులు తెలిపారు.
గుప్త్‌కాశీ నుంచి కేదార్‌నాథ్‌కు యాత్రికులతో బయల్దేరిన ఈ హెలికాప్టర్.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు పైలట్ కాగా.. ఆరుగురు యాత్రికులు. దట్టంగా మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన ట్విటర్‌లో తెలిపారు. అటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి కూడా ఘటనపై దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.