ప్రేమికులు ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఆరు నెలలు అయింది. ఇప్పుడు కుటుంబ సభ్యులు కలిసి వారి విగ్రహాలకు పెండ్లి చేసి ఒక్కటి చేశారు.
గుజరాత్ లో ఒక విచిత్రమైన ప్రేమ కథ తెర పైకి వచ్చింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ చావులోనైనా ఒక్కటవ్వాలని కోరుకున్నారు. అలా ఆరు నెలల క్రితం కలిసి తనువు చాలించారు.
ఇప్పుడు వారి ప్రేమ అర్థం చేసుకొని వారి తల్లిదండ్రులు వారి విగ్రహాలకు పెండ్లి చేశారు.
కుటుంబ సభ్యులు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో ఆశలు వదులుకున్న గణేష్ అనే వ్యక్తి, రంజన్ తో కలసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆగస్టు 2022 గుజరాత్ లోని తాపిలో జరిగింది. ఇద్దరూ ఉరివేసుకుని చనిపోయారు. ఈ సంఘటన తర్వాత వారి కుటుంబాలు వారు జీవించి ఉన్నప్పుడు కలిసి ఉండలేకపోయారని భావించారు. పశ్చాత్తాపంతో వారు తమ విగ్రహాలను తయారు చేశారు. ఆచారాలను అనుసరించి ప్రతిమలకు వివాహం చేశారు.
‘ఆ అబ్బాయి మా దూరపు బంధువు. ఇంకా జీవితంలో స్థిరపడలేదు. అందుకే పెళ్లికి ఒప్పుకోలేదు’ అని అమ్మాయి తాత భీంసింగ్ పధ్వీ తెలిపారు. అయితే వారిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు. అందుకే వారి ప్రేమను ఇలా అయినా గెలిపించాలని భావించాను. అందుకే ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ ఆలోచనను ఆచరణాత్మకం చేశాను. వారి కోరికలు తీర్చేందుకు, వారి ఆత్మకు శాంతి కలుగాలని ఈ పని చేశామని కుటుంబీకులు తెలిపారు. అయితే కొందరు వీరిని విమర్మిస్తున్నారు. బతికి ఉన్నప్పుడు పెండ్లికి ఒప్పుకొని ఉంటే ఇలా విగ్రహాలకు పెండ్లి చేయాల్సిన అవసరం ఉండేది కాదంటూ తిట్టి పోస్తున్నారు. మరికొందరు ఇలా అయినా వారి ప్రేమను అర్థం చేసుకున్నారని భావిస్తున్నారు.