వైవాహిక జీవితంలో భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. కానీ, కొందరు పెళ్లి అయిన తర్వాత జీవితంపై విరక్తి చెంది విడిపోతారు. మరికొందరు అనుమానాలతో సంసారం చేయడం ఇష్టం లేక, అత్తగారింట్లో ఇబ్బందులు పడలేక, రకరకాల కారణలతో దూరమైపోతుంటారు. కానీ, ఓ భార్యభర్తలు మాత్రం 33 సంవత్సరాలపాటు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపి, అనంతరం గొడవల కారణంగా విడిపోయి ఒకరిపై ఒకరు 60 కేసులు పెట్టుకున్న సంఘటన కలకలం రేపింది. అంతేకాకుండా 11 ఏండ్లుగా తమకు న్యాయం చేయాలని కోర్టుల చుట్టు తిరిగి, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారి ఫిర్యాదులను విన్న దర్మాసనం విస్తుపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. సుప్రీంకోర్ట్‌లో బుధవారం ఓ భార్యభర్తల కేసు న్యాయవాదులను తికమకపెట్టింది. ముప్పై ఏళ్లు కాపురం చేసి, 11 ఏళ్లుగా విడిగా ఉంటున్న భార్యాభర్తలు పరస్పరం 60 కేసులు పెట్టుకొన్న తీరును చూసి సుప్రీంకోర్సు విస్తుపోయింది. దీంతో సుప్రీంకోర్ట్ మీ న్యాయవాదుల చాతుర్యాన్ని తప్పక గుర్తించాలని వ్యాఖ్యానించింది. కోర్టు వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి వెళ్లండంటూ విడిపోయిన దంపతులకు సూచించింది.
‘ఏం చేద్దాం! కొన్ని వివాదాలు అట్టే పరిష్కారం కావు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగడానికి వాళ్లు ఇష్టపడతారు. ఎప్పుడైనా ఒకరోజు కోర్టును చూడకపోతే, ఆ రోజు వారికి నిద్ర పట్టదు’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేలా మధ్యవర్తిత్వానికి వెళ్లడం ఉత్తమమని దంపతుల తరఫు న్యాయవాదులకు తెలిపింది. జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లి కూడా ఉన్న ధర్మాసనం.. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కారమయ్యేదాకా ఇతర పెండింగు కేసుల జోలికి వెళ్లేందుకు ఇద్దరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది.