600 సెల్‌ఫోన్ టవర్ల చోరీ.. షాకైన కంపెనీ - MicTv.in - Telugu News
mictv telugu

600 సెల్‌ఫోన్ టవర్ల చోరీ.. షాకైన కంపెనీ

June 26, 2022

డబ్బు, బంగారం లాంటివి దొంగతనం చేస్తారని విన్నాం. అంతెందుకు మొన్న బీహార్‌లో స్టీల్ బ్రిడ్జీనే ఎత్తుకెళ్లిన ఘటన చూశాం. కానీ, మొబైల్ టవర్ దొంగతనం గురించి విన్నామా? అదీ ఏకంగా 600 టవర్లను చోరీ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసిన టవర్లను లాక్ డౌన్ సమయంలో దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. నష్టాలు రావడంతో 2018లోనే కంపెనీ తన సేవలను నిలిపివేయగా, తర్వాత కరోనా రావడంతో టవర్లను పర్యవేక్షించడానికి సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు అటు వైపు వెళ్లలేదు. ఈ మధ్య ఇతర కంపెనీ నెట్‌వర్క్ అవసరాల కోసం పరిశీలించడానికి కంపెనీ ప్రతినిధులు వెళ్లినప్పుడు ఈరోడ్ జిల్లాలో ఓ టవర్ కనిపించలేదు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఏకంగా 600 టవర్లు కనిపించకుండా పోయాయని గుర్తించారు. కంపెనీ దేశ వ్యాప్తంగా 26 వేల టవర్లను ఏర్పాటు చేయగా, తమిళనాడులో 6000 టవర్లను ఏర్పాటు చేసింది. అందులో 600 టవర్లు పోవడంతో కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లింది. ఇది ఒక ముఠా చేసిన పని అని కంపెనీ ఆరోపిస్తోంది. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.