62 ఏళ్ల వృద్ధుడి రికార్డు.. 8 గంటలకు పైగా ఆ పొజీషన్‌లో - MicTv.in - Telugu News
mictv telugu

62 ఏళ్ల వృద్ధుడి రికార్డు.. 8 గంటలకు పైగా ఆ పొజీషన్‌లో

February 25, 2020

62 Years Old Man.

వయసు మీరితే ఏంటీ ఒంట్లో సత్తువ ఉంది అంటున్నాడు ఈ 62 ఏళ్ల పెద్దాయన. ఆయన దేహం రాయిలా ఉంటుంది. నిత్యం వ్యాయామం ఆయనకు వ్యసనంలా మారిపోయింది. అందుకే ఆయన ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇలాంటి రికార్డును బహుశా యుక్త వయసులో ఉన్న కండలు తిరిగిన బాడీ బిల్డర్లు కూడా చేయలేరేమో. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే.. అమెరికాకు చెందిన జార్జి హుడ్ ప్లాంక్ పొజిషన్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 8 గంటల 15 నిమిషాల 15 సెకెన్ల పాటు ఈ పొజిషన్‌లోనే ఉండి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. చైనాకు చెందిన మావో వీడాంగ్ పేరిట ఉన్న రికార్డును జార్జి అధిగమించడం విశేషం. 

ఈ రికార్డు సాధించడం కోసం రోజుకు ఏడుగంటల పాటు శిక్షణ తీసుకునేవాడినని జార్జి తెలిపారు. రోజుకు 700 ఫుషప్స్ చేసేవాడినని తన కఠిన వ్యాయామం గురించి చెప్పారు. కష్టానికి ఫలితం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్లాంక్ పొజిషన్ అంటే.. నిత్యం ఎక్స్‌ర్‌సైజులు చేసేవారికి ఈ పేరు పరిచయమే. పుషప్స్ ప్రారంభించే ముందు రెండు చేతులపై దేహాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉదరభాగాన్ని నేలకు తాకకుండా ఉంచడాన్నే ప్లాంక్ అంటారు. అయితే సాధారణంగా ఎక్కువ సేపు ఇదే పొజిషన్‌లో ఉండటం అసాధారణ విషయం. అలాంటి అసాధ్యాన్ని ఈ వయసులో సుసాధ్యం చేయడంతో జార్జిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.