వ్యభిచారం కోసం.. వందలాది పాక్ యువతుల సరఫరా - MicTv.in - Telugu News
mictv telugu

వ్యభిచారం కోసం.. వందలాది పాక్ యువతుల సరఫరా

December 4, 2019

చైనా-పాకిస్తాన్ దేశాల మధ్య ఎకనామిక్ కారిడార్ ఏర్పాటవుతోన్న సంగతి తెల్సిందే. ఈ పనుల్లో భాగంగా చైనా పౌరులు పాక్‌లో పర్యటిస్తున్నారు. ఈ ముసుగులో చైనీయులు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. పాక్ యువతుల పేదరికాన్ని ఆసరాగా తీసుకుని పెళ్లి పేరుతో అక్రమంగా చైనాకు తరలిస్తున్నారు. పాకిస్థాన్‌లోని క్రిస్టయన్ మైనార్టీ యువతులను చైనా ముఠాలు టార్గెట్ చేసినట్టు సమాచారం. తల్లిదండ్రులకు డబ్బులు ఆశచూపి పెళ్లి చేసుకుని వారిని తమ వెంట చైనాకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. చైనాకు చెందిన పెళ్లి కొడుకుల నుంచి 25,000 నుంచి 65,000 డాలర్లు అంటే రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకూ మధ్యవర్తులు వసూలు చేసి, యువతుల తల్లిదండ్రులకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. పాక్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 629 మంది మహిళలను చైనా ముఠాలకు అమ్ముడుపోయినట్లు పాకిస్థాన్ అధికారుల దర్యాప్తులో తేలింది.

pakistan

ఇదిలా ఉంటే, మహిళ అక్రమ రవాణాలో నిందితులుగా ఉన్న మొత్తం 31 మంది చైనీయులను అక్టోబరులో ఫైసలాబాద్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అక్రమ రవాణాకు గురైన మహిళలు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడమే ఇందుకు కారణం. మహిళలను బెదిరించడం, డబ్బు ఆశచూపడం లాంటి చర్యలతో చైనీయులు నోరు నొక్కేశారు. వారికీ వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రతీకారం తీర్చుకుంటారని భయపడి ఉంటారని పాకిస్తాన్ పోలీసులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మహిళ అక్రమ రవాణా కేసుల్లో దర్యాప్తు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని సామాజిక కార్యకర్త సలీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. కొంత మంది అధికారులను బదిలీచేశారని ఆయన తెలిపారు. అక్రమ రవాణ ముఠాల చేతిలో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న కొంత మంది యువతులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో ఇక్బాల్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ విషయం తమకు తెలియని చైనా విదేశాంగ శాఖ సన్నాయి నొక్కులు నొక్కుతుండడం గమనార్హం.