68th National Film Awards Best Feature Film Award Goes To Colour Photo
mictv telugu

‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. టాలీవుడ్‌కు మొత్తం 4

July 22, 2022

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 68వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ ఎంపికైంది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో ‘నాట్యం’, ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన కలర్‌ ఫొటో ఎంపికైంది. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇద్దరు ప్రేమికుల మధ్య కులం అడ్డుగోడగా ఉండడంతో వారు జీవితాలు చివరికి ఏమయ్యాయి అని ఎంతో హృద్యంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా అల వైకుంఠపురములో చిత్రానికి గానూ తమన్‌కు అవార్డు వరించింది. ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు నాట్యం చిత్రానికి పనిచేసిన సంధ్యారాజుకి అవార్డు వచ్చింది. అదే సినిమాలోని మేకప్ విభాగానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా టీవీ రాంబాబు జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య సూరరై పొట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఏకగా ఐదు అవార్డులు వచ్చి పడ్డాయి. ఉత్తమ నటులుగా సూర్య (సూరారై పొట్రూ), అజయ్ దేవగణ్‌(తానాజీ)లకు అవార్డు వచ్చింది. ఫీచర్స్ ఫిల్మ్స్‌లో బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో సుధా కొంగర (సూరారైపొట్రూ)కు అవార్డు వచ్చింది. ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు)కి అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా అయ్యప్పనుమ్‌ కోషియుం దర్శకుడు దివంగత సచ్చిదానందన్‌కు అవార్డు దక్కింది.