తెలంగాణలో పోలీసు పోస్టులకు.. 7 లక్షల దరఖాస్తులు!.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో పోలీసు పోస్టులకు.. 7 లక్షల దరఖాస్తులు!..

May 18, 2022

తెలంగాణ రాష్ట్రంలో మే 2వ తేదీ నుంచి పోలీస్ ఉద్యోగాలకు ఆల్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తులకు సంబంధించి ఇప్పటివరకు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులతోపాటు ప్రత్యేక భద్రతా దళం, అగ్నిమాపక, రవాణా శాఖల పోస్టులకు 6.50 లక్షల మంది అభ్యర్థులు ఆప్లై చేసుకున్నారని అధికారులు తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ గడువు మే 20తో ముగుస్తుంది. గడువు ముగిసేనాటికి మరో 1.50 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది నిరుద్యోగులు ఆప్లై చేయనున్నారు.

అధికారులు మాట్లాడుతూ..”తొలిరోజే 15,000 దరఖాస్తులు వచ్చాయి. 2018లో 18 వేల ఉద్యోగాలకు 7.19 లక్షల మంది ఆప్లై చేసుకున్నారు. తాజాగా విడుదలైన పోస్టులకు కూడా దాదాపు 7 లక్షలకు పైగానే దరఖాస్తులు వస్తాయి. చివరి నాలుగు రోజుల్లో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశముంది. దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేశాం” అని అన్నారు.

ఇక, కానిస్టేబుల్ పోస్టుల విషయానికొస్తే.. ఈసారి విడుదలైన ఆరు నోటిఫికేషన్లలో మొత్తం 17,281 పోస్టుల్లో 16,694 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. దాంతో పోటీ తీవ్రంగా పెరిగిందని, కానిస్టేబుల్ పోస్టులకు సుమారు 5-6 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టులు జిల్లా కేడర్‌కు చెందినవి కావడంతో అభ్యర్థులు పోటీపడి ఆప్లై చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.