7-year-old school boy turns Zomato delivery boy after father's accident,
mictv telugu

కుటుంబం కోసం జొమాటో డెలివరీ బాయ్‌గా మారిన ఏడేళ్ల బాలుడు

August 3, 2022

ఏడేళ్ల వయసులోనే తలకు మించిన బాధ్యతను మోస్తున్నాడో బాలుడు. తండ్రి ప్రమాదానికి గురై ఇంట్లో ఉంటే.. అతడి స్థానంలో పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ బాలుడికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రికి అండగా నిలబడటంతోపాటు, కుటుంబాన్ని పోషిస్తున్నందుకు నెటిజన్లు ఆ బాలుడ్ని ప్రశంసిస్తున్నారు.

జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న తన తండ్రి ఓ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఏడేళ్ల ఆ బాలుడు తన కుటుంబం కోసం ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారాడు. తండ్రి ఉద్యోగాన్నే ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. ఉదయం పాఠశాలకు వెళ్తున్నాడు. సాయంత్రం ఆరు గంట నుంచి 11 గంటల వరకు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సైకిల్‌పై వెళ్తూ అందరికీ డెలివరీలు అందజేస్తున్నాడు.

ఈ క్రమంలోనే రాహుల్ మిట్టల్ అనే వ్యక్తి ఆర్డర్ చేసిన ఫుడ్ ని డెలివరీ చేశాడు ఆ బాలుడు. రాహుల్ ఆ బాలుడి గురించి తెలుసుకొని సోషల్ మీడియాలో.. అతనితో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో బాలుడు.. తన తండ్రి ప్రొఫైల్‌కు యాప్‌ ద్వారా బుకింగ్‌లు వస్తాయని, వాటిని తాను డెలివరీ చేస్తుంటానని చెప్పాడు. సైకిల్‌పై వెళ్లి ఆర్డర్‌లు అందజేస్తానని తెలియజేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ధైర్యంగా బాధ్యతలు స్వీకరించి కష్టపడి పని చేస్తున్న ఆ బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.