ఏపీలో రూ. 70 కోట్ల కరోనా స్కాం.. బ్లీచింగ్‌లో సున్నం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రూ. 70 కోట్ల కరోనా స్కాం.. బ్లీచింగ్‌లో సున్నం

May 13, 2020

70 Crore Bleaching Scam in Andhra Pradesh

కరోనాను అడ్డుపెట్టుకొని కూడా కాసులకు కక్కుర్తి పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. బ్లీచింగ్ పౌడర్ చల్లే పేరుతో ఏకంగా రూ. 70 కోట్ల ప్రభుత్వ సొమ్మును నొక్కేశారు. తెల్లటి సున్నానికి బ్లీచింగ్ పౌడర్ అంటూ కలరింగ్ ఇచ్చి తమ జేబులు నిపేసుకున్నారు అక్రమార్కులు. దీనిపై అనుమానాలు రావడంతో సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంట్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

ప్రభుత్వం బ్లీచింగ్ చేస్తూ.. కరోనాను కట్టడి చేయాలని చెప్పడంతో అక్రమార్కులు ఇదే అదునుగా రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి కాకినాడకు బ్లీచింగ్‌ పేరుతో తెల్లని సున్నం పదార్థం తరలించారు. దానికి బ్లీచింగ్ వాసన వచ్చే కెమికల్ కలిపి విరివిగా చల్లేశారు. బ్లీచింగ్ తయారు చేసే పరిశ్రమ పిడుగురాళ్లలో లేనప్పుడు ఎలా తెచ్చారని ఆరా తీయాగా అక్రమ బాగోతం బయటపడింది. ఇది ఒక్క కాకినాడలోనే కాకుండా చాలా ప్రాంతాలకు ఈ నకిలీ బ్లీచింగ్ సరఫరా జరిగి ఉంటుందని అనుమానించిన అధికారులు సోదాలు చేపట్టారు. 

జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పంచాయతీలకు డీపీవో కార్యాలయం ద్వారా సరఫరా చేసిన బ్లీచింగ్‌‌పై ఉన్నతాధికారులు ఆరా తీశారు. దీంతో  బ్లీచింగ్ పేరుతో భారీ కుంభకోణం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. దీని వెనక ఉన్నవారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఇంతటి కష్ట కాలంలో కూడా కాసులకు కక్కుర్తి పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ బ్లిచింగ్ స్కాం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.