70 వేలు దాటిన కరోనా కేసులు.. ఒక్కరోజే 87 మరణాలు - Telugu News - Mic tv
mictv telugu

70 వేలు దాటిన కరోనా కేసులు.. ఒక్కరోజే 87 మరణాలు

May 12, 2020

70 Thousand Corona Positive Cases In Indian

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్కును దాటేందుకు వేగంగా వెళ్తోంది. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య గతంలోకంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. రోజుకు కనీసం 3 వేలకు పైగా కొత్తగా వ్యాధి వచ్చిన వారిని గుర్తిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 70,756కు చేరిందని పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 3,604 మందికి వైరస్ సోకగా.. 87 మంది ప్రాణాలు వదిలారు. దీంతో మరణాల సంఖ్య 2,293కి చేరింది.ఈ వైరస్ సోకిన వారిలో 22,454 మంది డిశ్చార్జ్ కాగా.. మిగిలిన 46,008 మంది ఆయా రాష్ట్రాల్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 4,254,778  మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 287,293 మంది మరణించారు. వ్యాధిని జయించి కోలుకున్న వారి సంఖ్య 1,527,109గా ఉంది. కాగా అమెరికాలో మాత్రం ఇంకా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అక్కడ బాధితుల సంఖ్య 14 లక్షలకు చేరింది. 80 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ లో కరోనా తీవ్రత అలాగే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. తెలంగాణలో ఇటీవల తగ్గినట్టే కనిపించినా ఒక్కసారిగా పాజిటివ్ రోగులు పెరిగిపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 79 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం రోగుల సంఖ్య 1275గా ఉండగా.. 801 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 444 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.