కొడుకు చేయి, అల్లుడు నడుం విరగొట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు చేయి, అల్లుడు నడుం విరగొట్టాడు..

October 21, 2020

70 Years Old Couple Tea Selling With Broken Hand.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంతో మంది అభాగ్యులకు అదో గొంతులా మారిపోయింది. వారి కష్టాలను వెలుగులోకి తెచ్చి దాతలతో సాయం పొందేందుకు ఉపయోగపడింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత లాక్‌డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న ఎంతో మంది జీవితాలు వైరల్ కావడంతో చాలా మంది అండగా నిలిచారు. వారి కష్టాలను పంచుకోవడానికి ఇదో వారధిగా మారిపోయింది. తాజాగా మరోసారి సోషల్ మీడియా కారణంగా ఓ వృద్ధ దంపతుల ధీనగాధ వెలుగులోకి వచ్చింది. 

70 ఏళ్ల వయసులో విరిగిపోయిన చేయి, నడవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రోడ్డు పక్కనే టీ అమ్ముతూ కనిపించాడు. దేశ రాజధాని ఢిల్లీలోని  పాకెట్ 1 లోని సుభాష్ అపార్ట్మెంట్ సమీపంలో వీరిద్దరూ ఉంటున్నారు. రోడ్డుపైనే ఓ సిలిండర్ పెట్టుకొని టీ అమ్ముతూ వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జీవితం సాగిస్తున్నారు. ముసలి తనంలో అండగా ఉండాల్సిన కొడుకే వారిని చిత్ర హింసలు పెట్టడంతో ఈ విధంగా బతుకును భారంగా ఈడ్చాల్సి వచ్చింది. 

ఒకరోజు తాగిన మత్తులో అతడి కొడుకు ఆ పెద్దాయన చేయిని విరగొట్టాడు. దీంతో అది వంపులు తిరిగి పనికి రాకుండా తయారైంది. కొన్ని రోజులకు అల్లుడు కూడా నడుం విరగ్గొట్టడంతో లేవలేని స్థితికి వచ్చానని కన్నీరు పెట్టుకున్నాడు. కొంత కాలం పాటు రోడ్డుపై మొక్కజొన్న అమ్ముతూ జీవనం సాగించారు. ఆ తర్వాత అతడి కూతురు టీ స్టాల్ పెట్టుకునేందుకు సాయం చేసింది. సిలిండర్ కొనిచ్చి ఆదుకోవడంతో వారు ప్రతి రోజూ టీ అమ్ముకుంటున్నారు. వచ్చిన కొంత మొత్తంతో జీవనం  సాగిస్తున్నారు. ఇటీవల  విశాల్ రేషన్ అనే ఓ సామాజిక కార్యకర్త వారి జీవితాలను గురించి తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన వంతుగా రూ. 10,000 సాయం చేశాడు. అతడి గాయాలకు చికిత్స చేయాలని వైద్యులను కోరాడు. దీనికి దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఈ వృద్ధ జంట ధీన స్థితిని చూసి చాలా మంది నెటిజన్లు చలించి పోతున్నారు. వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని మరోసారి ఆ అభాగ్యుల్లో చిరునవ్వు కనిపించింది.