72 family members under one roof goes viral
mictv telugu

కలిసుంటే కలదు సుఖం అంటున్న కుటుంబం!

November 17, 2022

భార్య, భర్త.. వారి పిల్లలు. ఒక అపార్ట్మెంట్.. రెండు బెడ్రూమ్ల ఇల్లు. ఇప్పుడు కనిపిస్తున్న కుటుంబ కథా చిత్రం. కానీ ఒకే ఇంట్లో.. ఒకే చూరు కింద 72మంది కలిసుంటున్నారు.
నాలుగు జుట్లు కలిసుంటాయేమో కానీ.. రెండు కొప్పులు కలవవని ఒక సామెత ఉంది. అందుకే అత్తాకోడళ్లు వేరుగా ఉంటూ న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడడం మొదలుపెట్టాయి. ఒకప్పుడు కలిసుంటే కలదు సుఖం అనుకున్న వాళ్లే.. విడిపోయి కలిసుంటాం అంటూ చెబుతున్నారు. కానీ ఒకే ఇంట్లో ఒక్కటి కాదు.. రెండు కాదు కొన్ని కుటుంబాలు కలిసి ఉండగలవా? అంటే ఉండొచ్చు అనే నిరూపిస్తున్నదీ కుటుంబం.

ఇంటర్నెట్లో హల్చల్..
భారతదేశంలో కుటుంబాలు కలిసి ఉండడం అనే పద్ధతి ఉంది. అత్తలు, కోడళ్లు, వదినలు, తాతలు, తండ్రులు.. ఇలా బంధుత్వాల కలయికగా చూడడానికి ముచ్చటగా ఉండేవి ఒకప్పటి కుటుంబాలు. కానీ ఇప్పుడు ఆర్థిక, ఇతర సమస్యల కారణంగా న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏర్పడ్డాయి. కానీ ఒకప్పటి పద్ధతే మాకు ఆదర్శం అంటున్నదీ మరాఠీ కుటుంబం. సోలాపూర్లో దోయిజోడే కుటుంబంలో 72మంది కలిసే ఉంటున్నారు. వీరికి ఒక ట్రేడింగ్ కంపెనీ ఉంది. వీరి జీవనం ఎలా సాగుతుంది, ఎవరు ఏం పనులు చేస్తారు? వాళ్ల లైఫ్ స్టయిల్ గురించి బీబీసీ వీడియోను కూడా తీసింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది.

అశ్విన్ దోయిజోడే ఈ ఇంటికి పెద్ద. ఆయన వాళ్ల ఖర్చులను, వారి జీవిన విధానన్ని గురించి బాగా వివరించాడు. ‘రోజుకు కనీసం 10లీటర్ల పాలు కావాల్సి ఉంటుంది. ఒక్కరోజు కూరగాయల ఖర్చు సుమారు 1200రూపాయలు. అదే మాంసాహారం వండిన రోజు ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. ఇంటికి కావాల్సిన బియ్యం, ఇతర సరుకులు సంవత్సరానికి ఒకసారే హోల్సేల్లో తెస్తుంటాం. దీనివల్ల ఖర్చు కలిసొస్తుంది’ అంటున్నాడు. నైనా దోయిజోడే ఈ ఇంటికి కోడలిగా వచ్చింది. ఆమె కూడా తన అనుభవాన్ని ఇలా చెప్పింది. ‘నేను మొదట్లో చాలా కష్టపడ్డాను. అందరితో ఎలా ఉండాలి? ఎలా మెలగాలో తెలియకపోయేది. మా అత్త, తోడికోడళ్లు చాలా సహాయం చేశారు. ఇప్పుడు నా పుట్టింటికి వెళ్లడానికే నేను ఆలోచిస్తున్నా’ అంటున్నది నైనా. ఈ కాలంలో కూడా ఇలా కలిసి ఉంటారా? అంటూ చాలామంది వీళ్లను పొగుడుతూ కామెంట్ చేస్తున్నారు.