72ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ బాడీబిల్డింగ్ పోటీలకు.. - MicTv.in - Telugu News
mictv telugu

72ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ బాడీబిల్డింగ్ పోటీలకు..

June 1, 2022

సాధారణంగా ఏడు పదుల వయస్సులో ఉన్నవారెవరైనా రిటైర్మెంట్ తీసుకొని మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారు. లేదంటే పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలతో జీవితాన్ని ముగించేస్తారు. కానీ తమిళనాడు చెంగల్పట్టుకు చెందిన రతనం అనే వ్యక్తి.. మాత్రం జిమ్లో బరువులతో కుస్తీలు పడుతున్నారు. యువకులకు ఏమాత్రం తగ్గకుండా కండలు పెంచుతున్నారు. అంతేకాదు.. అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలోని మదురకంటకం ప్రాంతంలో నివసించే రతనం.. ఓ ఫిట్నెస్ ఫ్రీక్. టీనేజ్ లో ప్రారంభించిన కసరత్తులను ఇప్పటికీ క్రమం తప్పకుండా చేస్తూనే ఉన్నారు. చూస్తే 72 ఏళ్లు అంటే ఎవరూ నమ్మరు.

మే 22న హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీలకు హాజరైన ఆయన.. ఇందులో ఉత్తమ ప్రదర్శన చేసి.. ఆసియా బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు. 54వ ఆసియా బాడీబిల్డింగ్ పోటీల్లో 60 ఏళ్లు పైబడిన విభాగంలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం సంపాదించుకున్నారు. జులై 15 నుంచి 21 మధ్య మాల్దీవులులో ఈ పోటీలు జరగనున్నాయి. ఆ పోటీల్లో గెలిస్తే తమిళనాడుతో పాటు దేశానికి ఆయన మంచిపేరు తీసుకొస్తానని చెబుతున్నారు రతనం.