పెరేడ్ గ్రౌండ్స్‌లో పంద్రాగస్ట్.. అమరవీరులకు కేసీఆర్ నివాళులు - MicTv.in - Telugu News
mictv telugu

పెరేడ్ గ్రౌండ్స్‌లో పంద్రాగస్ట్.. అమరవీరులకు కేసీఆర్ నివాళులు

August 15, 2020

74th Independence Day Celebration at the parade grounds .. CM KCR tributes to the martyrs

పంద్రాగస్ట్ సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులను నేతలు, ప్రజలు మననం చేసుకుంటున్నారు. వారి త్యాగాలకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. మన దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు వారు చేసిన త్యాగాలే పునాది వేశాయని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్‌ గ్రౌండ్‌లోని అమరవీరుల స్ధూపం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సైనిక వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సైనికాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, కరోనా కారణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ తొలిసారి పెరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. లేదంటే ప్రతిఏడు గోల్కొండ కోటలో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.