రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన స్వాతంత్రం ఎందరో వీరుల త్యాగ ఫలితమని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని చెప్పారు. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి అని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై గవర్నర్ పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వ పని తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదు- జాతి నిర్మాణం అభివృద్ధి. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు- రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ సౌలభ్యాలు ఉండాలి. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం – రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. తెలంగాణతో నాకున్న బంధం మూడేళ్లు కాదు.. పుట్టుకతో ఉంది. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు.. కానీ నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.
వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఉందన్నారు. ఇక రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు.