ఆఫ్గనిస్తాన్ అంటే బాంబు పేలుళ్లు, తుపాకీ మోతలు గుర్తుకొస్తాయి. ఈ మధ్య వాటి సరసన మహిళలపై ఆంక్షలు కూడా చేరాయి. ఎప్పుడు చూసినా పేలుళ్లు, మరణాల వార్తలు వినిపించే ఆఫ్ఘనిస్థాన్ నుంచి తొలిసారి కొత్త రకం సమస్యపై వార్తలు వస్తున్నాయి. గత వారం రోజుల్లో దీని వల్ల 78 మంది చనిపోయారు.
వీరితో పాటు 75 వేల పశువులు కూడా మరణించాయి. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ విపత్తు శాఖ వెల్లడించింది. ఈ మరణాలకు కారణం విపరీతమైన చలి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో మనుషులు, పశువులు పిట్టల్లా రాలిపోతుండడం కలచివేస్తోంది. ప్రస్తుతం అక్కడ మైనస్ 35 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ నెలకొంది. చలి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీనిపై విచారం వ్యక్తం చేసి ఇబ్బంది పడుతున్న 10 లక్షల మందికి తగిన సాయం అందిస్తామని తాలిబన్ అధికార ప్రతినిధి షఫీవుల్లా రహీమి తెలిపారు. తాలిబన్ ప్రభుత్వాన్ని ఏ దేశం గుర్తించకపోవడంతో సాయం అందకుండా పోతోంది. ఇప్పిటికే ఆర్ధిక, ఆహార్ సంక్షోభంలో ఉన్న ఆ దేశంలో చలి పంజా విసరడంతో పరిస్థితి దయనీయంగా మారింది.