జుకర్‌బర్గ్‌.. వేలుపెడితే ఖబడ్దార్: కేంద్రమంత్రి హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

జుకర్‌బర్గ్‌.. వేలుపెడితే ఖబడ్దార్: కేంద్రమంత్రి హెచ్చరిక

March 21, 2018

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాలు యత్నించినట్లు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా సాగిన ప్రచారాన్ని ట్రంప్ అధిగమించి గద్దె ఎక్కాడు. వచ్చేఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఫేస్‌బుక్‌ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కు  వార్నింగ్ జారీ చేసింది. తమ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు యత్నించి సహించబోమని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.

మిస్టర్ మార్క్ జుకర్‌బర్గ్.. భారత ఐటీ మంత్రిగా నేను చెబుతున్న మాటను నువ్వు బాగా గుర్తుపెట్టుకో.  భారతీయుల డేటాను చోరీ చేస్తే విచారణ కోసం నీకు సమన్లు జారీ చేస్తాం. మరికొని చర్యలు తీసుకుంటాం..’ అని హెచ్చరించారు. ఫేస్ బుక్ యూజర్ల డేటాను ఆ కంపెనీ చోరీ చేసి దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు ఒకపక్క దుమారం రేపుతుండగా మంత్రి హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు 5 కోట్ల మంది ఫేస్‍‌బుక్ ఖాతాల డేటాచిక్కిందని వార్తలు వస్తున్నాయి.

అడ్డదారిలో మా ఎన్నికల్లో వేలుపెడితే సహించం. కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే మేం పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు అండగా ఉంటాం. 20 కోట్ల మంది భారతీయులు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. అమెరికా తర్వాత ఫేస్‌బుక్‌కు రెండో అతిపెద్ద మార్కెట్ మా దేశమే. డేటా చోరీ జరిగినట్లు మా దృష్టికి వస్తే ఐటీ చట్టాన్ని ప్రయోగిస్తాం..’ అని రవిశంకర్ అన్నారు.