మూగజీవుల ప్రాణాలతో ప్లాస్టిక్ చెలగాటం.. జింక పొట్టలో 7కిలోలు.. - MicTv.in - Telugu News
mictv telugu

మూగజీవుల ప్రాణాలతో ప్లాస్టిక్ చెలగాటం.. జింక పొట్టలో 7కిలోలు..

November 26, 2019

మన అవసరాలను చాలా తేలికగా తీరుస్తున్న ప్లాస్టిక్ కవర్లు, మనకే కాకుండా నోరులేని మూగ జీవులకు ఎలాంటి హాని కలిగిస్తున్నాయో చెప్పే గాథ ఇది. అన్నీ తెలిసిన మనం ప్లాస్టిక్‌తో సహవాసం చేస్తున్నాం. వాడుకున్నాం పారేసాం అని చాలా ఈజీగా వాటిని అక్కడా, ఇక్కడా పారేస్తాం. కానీ, అవి జంతువులు, పక్షులకు ఎంత కీడు తలపెడుతున్నాయో మనం ఎప్పుడు గ్రహిస్తాం? ప్లాస్టిక్ వాడకాన్ని ఎప్పుడు తగ్గిస్తాం? అటు పర్యావరణానికి కూడా ప్లాస్టిక్ తీరని అన్యాయం చేస్తోంది. అయినా మనం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాం.  

మనుషుల నిర్లక్ష్యం బ్యాంకాక్‌లో ఓ మూగప్రాణాన్ని బలితీసుకుంది. థాయ్‌లాండ్‌లో జింక కడుపులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరుకోవడంతో అది మృతిచెందింది. ఉత్తర నాన్‌ ప్రావిన్స్‌లోని ఖున్‌ సతాన్‌ నేషనల్‌ పార్కులో జింక మృతదేహంలో 7 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను వెలికితీశారు. 135 సెంటీమీటర్ల ఎత్తు, 230 సెంటీమీటర్ల పొడవున్న మగజింక పదేళ్ల వయస్సు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జింక పొట్టలో నుంచి బయటకు తీసిన ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో డ్రాయర్‌ కూడా ఉంది. ప్లాస్టిక్‌ బ్యాగులు, కాఫీ, నూడుల్స్ ప్యాక్‌లు, ప్లాస్టిక్‌ తాడు, రబ్బర్‌ గ్లౌవ్స్‌, హ్యాండ్‌ కర్చీఫ్‌తో పాటు ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడ్డాయి. అన్నేసి ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి అధికారులు వాపోయారు. అవి దాని పొట్టలో అరగకపోవడం వల్లే చనిపోయిందని అన్నారు.