పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై 8.65 శాతం వడ్డీ - MicTv.in - Telugu News
mictv telugu

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై 8.65 శాతం వడ్డీ

August 30, 2019

8.65% interest on EPF to be notified

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర మంత్రి శుభవార్త చెప్పారు. పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ పెంచడానికి కేంద్రం మంత్రిత్వ శాఖ సుముఖంగా వుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా పెంచాలని నిర్ణయిస్తూ త్వరలోనే ప్రకటన వెలువరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. ‘పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఏమాత్రం విభేదించటం లేదు. త్వరలోనే దీనిపై ప్రకటన విడుదల అవుతుంది. దీంతో ఆరుకోట్ల మంది పీఎఫ్‌ చందాదారులకు లబ్ధి చేకూరనుంది’ అని ఆయన వెల్లడించారు. 

ఫిబ్రవరిలో మంత్రి సంతోష్ గంగ్వార్ నేతృత్వంలో ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశమై వడ్డీ పెంచేందుకు ఆమోదం తెలిపారు. మండలి ఆమోదించిన ప్రతిపాదనలు ఆర్ధిక శాఖకు పంపారు. దీనిపై ఆర్ధిక సేవల విభాగం(డీఎఫ్ఎస్) ఏప్రిల్‌లో (2018-19)సంవత్సరానికి పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు సుముఖత చూపింది. ఇక కార్మిక శాఖ, ఆదాయ పన్నుశాఖలు సంయుక్తంగా నోటిఫై చేయాల్సి ఉంది. అనంతరం సంస్ధ చందాదారుల ఖాతాలో వడ్డీని జమ చేయనుంది.అయితే  2017-18 సంవత్సరానికి పీఎఫ్‌ వడ్డీరేటును ఐదేళ్ల కనిష్ఠానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఖాతాదారులకు ప్రస్తుతం 8.55శాతం వడ్డీనే లభిస్తుంది.