నేలకొండపల్లిలో 8 కేసులు.. కంటైన్మెంట్ జోన్‌గా
ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాలోని నేలకొండపల్లిలో 8 మందికి కరోనా సోకినట్లు తెలిపింది. నేలకొండపల్లిలో కరోనా రోగి నుంచి మరో 8 మందికి వైరస్ వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి కుటుంబంలోని ముగ్గురికి, రోగి దుకాణంలో పనిచేసే మరో ఐదుగురికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నేలకొండపల్లికి వచ్చే దారులను మూసివేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఖమ్మం రూరల్ ఏసీపీ సోమా వెంకటరెడ్డి, కూసుమంచి సీఐ మురళి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా, మండల కేంద్రమైన నేలకొండపల్లి గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పధ్నాలుగు రోజులపాటు నేలకొండపల్లి.. కంటైన్మెంట్ జోన్‌గా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో… ఆదివారం నుంచి పధ్నాలుగు రోజుల పాటు నేలకొండపల్లిలో పూర్తి లాల్‌డౌన్ అమల్లో ఉంటుంది. జిల్లా కలక్టర్ ఆదేశాల మేరకు ప్రజలెవ్వరూ బయటకు రాకూడదు. అధికారులు ఆదేశాలు ఇచ్చేంతవరకూ దుకాణాలు తెరవకూడదని నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి రాయపూడి నవీన్ తెలిపారు.