8 Congress MLAs joined BJP in Goa
mictv telugu

గోవాలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

September 14, 2022

ఓ వైపు అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం భారత్ జోడో యాత్ర చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. చిన్న రాష్ట్రమైన గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోయారు. గోవా బీజేపీ సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో వారంతా కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. అంతకు ముందు బుధవారం ఉదయం వారంతా స్పీకరుని కలవడంతో ఊహాగానాలు మొదలవగా, తర్వాత పార్టీ మారుతున్నట్టు గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవడే మీడియాకు వెల్లడించారు. తర్వాత కొద్ది సేపటికే వారంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. గోవా అసెంబ్లీతో మొత్తం కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 11 కాగా, అందులో 8 మంది వెళ్లిపోవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును తప్పించుకునే అవకాశం ఉంది. పార్టీ మారిన వారిలో మాజీ సీఎం దిగంబర కామత్, మైకేల్ లోబో వంటి ప్రముఖ నేతలున్నారు. గోవా అసెంబ్లీకి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, 40 స్థానాలకు గాను బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందు 2019లో కూడా 15 మందిలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం తెలిసిందే.