ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గోరఖ్‌పూర్ దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.. ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మితిమీరిన వేగానికి తోడు.. డ్రైవర్ నిద్రే ప్రమాదానికి కారణమని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. వివాహ వేడుకకు వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు.