వెంకన్న సన్నిధిలో కరోనా డేంజర్ బెల్స్.. 80 మందికి పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న సన్నిధిలో కరోనా డేంజర్ బెల్స్.. 80 మందికి పాజిటివ్

July 9, 2020

80 TTD Employees Suffer With Corona

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కరోనా టెన్షన్ తప్పడం లేదు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత స్వామివారి దర్శనానికి భక్తులకు అవకాశం లభించింది. ఈ క్రమంలో వరుసగా టీటీడీ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో కలవరం మొదలైంది. వేలాది మంది భక్తులు నిత్యం వెంకన్నను దర్శించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ పనిచేసే వారు కరోనా బారిన పడుతున్నారని తెలిసి ఆందోళనకు గురౌతున్నారు. 

టీటీడీ సిబ్బందిలో ఇప్పటి వరకు 80 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అక్కడ పని చేసే సిబ్బందికి ముందు జాగ్రత్తగా పరీక్షలు చేస్తున్నారు. ప్రతి రోజు 200 మంది సిబ్బందికి టెస్టులు చేయగా ఈ ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకు దాదాపు 800 మందిని పరీక్షించారు. ఇక్కడ ఊరట ఇచ్చే అంశం ఏంటంటే సిబ్బంది ద్వారా ఏ భక్తుడికి కూడా వైరస్ సోకిన ఆధారాలు బయటకు రాలేదు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తిగా మారింది. వైరస్ బారిన పడిన వారిలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే ఏపీని కరోనా వణికిస్తోంది. ఇక టీటీడీలో కూడా ఇలాగే వైరస్ వ్యాప్తి కొనసాగితే ఇబ్బందులు తప్పవని శ్రీవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు.