పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరి జీవితంలో ఫిట్ నెస్ అంతర్భాగమైపోయింది. ముంబైకి చెందిన 80 యేండ్ల వృద్ధురాలు మారథాన్ లో పరుగెత్తి అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఆరోగ్యమే సంపద అంటూ పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఆరోగ్యంపైనే దృష్టిసారిస్తున్నారు. రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు మన జీవితంలో భాగమైపోయాయి. 60యేండ్లు దాటిందంటే చాలావరకు అడుగు తీసి అడుగు వేయాలంటేనే కాస్త ఆలోచిస్తారు. అలాంటిది 80యేండ్ల వయసులో మారథాన్ చేసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసిందీ బామ్మ.
వృద్ధురాలి మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో తన నాని (తల్లి తల్లి) వీడియోను షేర్ చేసింది. 80 యేండ్ల భారతి టాటా మారథాన్ కోసం చేతిలో జాతీయ జెండాను పట్టుకొని చీర, స్నీకర్లతో 4.2కి.మీ. ల మారథాన్ ను హాయిగా ఎలా నడుస్తుందో వీడియో షేర్ చేసింది. ఆమె మారథాన్ ను 51 నిమిషాల్లో పూర్తి చేసింది. ఇదంతా ఒక చానెల్ కవర్ చేసింద. చివరన ఆమె ఇంటర్వ్యూని కూడా తీసుకున్నది.
భారతి ప్రతిరోజూ మారథాన్ ప్రాక్టీస్ చేస్తున్నానని, ఇది తను ఐదవసారి మారథాన్ లో పాల్గొనడం అని చెప్పింది. ఆమె జాతీయ జెండాను ఎందుకు పట్టుకుందని అడిగినప్పుడు.. ‘నేను భారతీయురాలిగా గర్విస్తున్నాను. నా జాతీయ గుర్తింపు గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. యువత ఆరోగ్యం కోసం పరుగెత్తాలని’ సూచించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వెంటనే కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. ‘కంగ్రాట్స్ నాని.. గ్రేట్ గోయింగ్, కీప్ ఇట్ అప్’, ‘వావ్.. ఎంతో స్ఫూర్తిదాయకమైన బామ్మ’ అంటూ కామెంటుతున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ బామ్మ ఇంటర్వ్యూను మీరూ చూసేయండి.