లంక క్రికెటర్ బయోపిక్‌పై తమిళనాడులో రచ్చరచ్చ  - MicTv.in - Telugu News
mictv telugu

లంక క్రికెటర్ బయోపిక్‌పై తమిళనాడులో రచ్చరచ్చ 

October 17, 2020

vbnvbnvn

కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటాయి. మరికొన్ని అయితే టైటిల్ ప్రకటించగానే వివాదాస్పదం అవుతాయి. శ్రీలంక ఆఫ్ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘800’ బయోపిక్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఈ సినిమా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ‘విజయ్ నువ్వు ఆ పాత్రలో అస్సలు నటించవద్దు’ అంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఇప్పుడు వారి జాబితాలో అధికార అన్నాడీఎంకే కూడా చేరింది. మురళీధరన్ బయోపిక్‌లో నటించడంపై విజయ్ సేతుపతి మరోసారి ఆలోచించుకుంటే బాగుంటుందని అన్నాడీఎంకే శ్రేణులు తెలిపాయి.

ఈ విషయమై తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘2009లో శ్రీలంకలో జరిగిన పౌర యుద్ధానికి నాటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స బాధ్యుడు. శ్రీలంకలో తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సకు మద్దతు ఇస్తున్న మురళీధరన్‌ను తమిళులు ఏవిధంగా ఆమోదిస్తారు. ఈ అంశాలన్నింటినీ విజయ్ సేతుపతి పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలి. విజయ్ సేతుపతి అభిమానులు సైతం ఆయన చర్యను అంగీకరించని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ సినిమా నుంచి తప్పుకుంటే మాత్రం విజయ్ సేతుపతి కీర్తి మరింత పెరుగుతుంది. ఆయన తమిళులకు ఎంతో మేలు చేసినవారు అవుతారు’ అని ’ అని జయకుమార్ వెల్లడించారు. కాగా, జయకుమార్ వ్యాఖ్యలపై విజయ్ సేతుపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చిత్ర యూనిట్ కూడా షూటింగ్‌కు అంతా సిద్ధం చేసుకున్నాక వివాదం చెలరేగడంతో ఏం చెయ్యాలో తోచని స్థితిలో పడింది.