డాక్టర్‌కు కరోనా.. 800 మంది నిర్బంధం - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్‌కు కరోనా.. 800 మంది నిర్బంధం

March 26, 2020

800 Quarantined After Delhi Mohalla Clinic Doctor.

కరోనా వ్యాధిగ్రస్థులకు వైద్య సేవలు అందించే వైద్యులకు ఆ వైరస్ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. ఢిల్లీలో ఓ వైద్యుడికి కరోనా సోకినట్టు తేలింది. ఈశాన్య ఢిల్లీ మౌజ్‌పూర్ ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నుడుస్తున్న మొహల్లా క్లినిక్‌కు చెందిన వైద్యుడి(49)కి కరోనా సోకడం స్థానికంగా కలకలం రేపింది.  సదరు వైద్యుడికి ఎవరి ద్వారా వైరస్ సోకిందో ఇంకా తెలియలేదు. ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. వైద్యుడు అవడంతో ప్రతి రోజూ చాలా మందిని ఆయన ముట్టుకునే అవకాశం ఉందని, దానివల్ల మరెందరికో వైరస్‌ సోకుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. 

వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ వైద్య శాఖ ఈ నెల 12 నుంచి 18వ తేదీల మధ్య ఆ డాక్టరును ఎంతమంది కలిశారో, ఆ క్లినిక్‌కు ఎంతమంది వచ్చారో గుర్తించే పనిలో పడింది. దీనిపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ మాట్లాడుతూ.. ‘ఆయన కలిసిన మొత్తం 800 మందిని గుర్తించాం. వారందరినీ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంచాం’ అని తెలిపారు. కాగా, వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.