ఈ సంవత్సరం వివాహ సంబంధిత కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సమయంలో వివాహం చేసుకొని అమ్మాయిలకు ఒకలాంటి టార్చర్ మొదలవుతుంది. భారతదేశంలో ఇదీ మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే 81శాతం పెండ్లి చేసుకోకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారట. డేటింగ్ యాప్.. బంబుల్ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం.. దాదాపు 5లో ఇద్దరు (39శాతం) భారతీయ మహిళలు తమ కుటుంబాలు చూపించిన పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరో 39శాతం మంది మాత్రం పెండ్లిళ్ల సీజన్ వస్తే చాలు ఒత్తిడికి గురవుతున్నారు. మరో 33శాతం మంది మాత్రం నిబద్ధతతో, దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరుచుకోవడానికి చూస్తున్నారు.
ఈ బంబుల్ ప్రకారం.. ఈ పెళ్లిళ్ల సీజన్ లో భారతదేశంలో డేటింగ్ ట్రెండ్ ‘కాన్షియస్ లీ సింగిల్’ మరింత ప్రాచుర్యం పొందుతున్నది. ఎందుకంటే ఒంటరి వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉండటాన్ని ఎంచుకుంటున్నారు. ఈ యాప్ ప్రకారం భారతదేశంలో పోల్ చేసిన 81శాతం మంది మహిళలు అవివాహితులుగా ఉండటాన్ని, ఒంటరిగా జీవితాన్ని ఇష్టపడుతున్నారట. అయితే ఇందులో 63శాతం మంది తమ ప్రాధాన్యతకు తగినట్లుగా ఉన్న అబ్బాయి దొరికితే పెండ్లికి ఓకే చెబుతామని అంటున్నారు. మరొక సర్వే ప్రకారం.. 83శాతం మంది మహిళలు సరైన వ్యక్తిని కనుగొనే వరకు వేచి ఉండటమే వారికి సంతృప్తి కలిగిస్తుందని చెప్పారు.
పెండ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు ఒక్కొక్కరు ఒక్కోలా అమ్మాయిల మీద మాటల బాణాలను సంధిస్తుంటారు. దీంతో అమ్మాయిల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకే అమ్మాయిలు ఇలాంటి వేడుకలకు హాజరు కావడం కూడా తగ్గిస్తున్నారట. చాలామంది అమ్మాయిలు.. ‘నేను ప్రస్తుతం నాపై దృష్టి సారిస్తున్నాను. నాకు ముఖ్యమైన అనేక విషయాలు ఉన్నాయి. వాటితోనే సమయం గడుపుతున్నా. అందుకే స్వంత అవసరాలు, కోరికలు నాకు గుర్తుకు రావడం లేదు’ అంటూ సమాధానమిస్తున్నారు. కొందరు మీ బెటర్ హాఫ్ ఎక్కడ అని అడిగితే.. ‘ఏ సగం? నేను పూర్తిగా ఇక్కడే ఉన్నాను’ అంటూ కూల్ గా సమాధానమిచ్చే అమ్మాయిలు ఉన్నారు. ఆందోళన చెందకుండా వారి కెరీర్ పైన దృష్టి సారిస్తున్నారు. ఒత్తిడి లేని జీవితాన్ని అనుభవించేందు అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే చెబుతున్నది.