నేను సైతం.. పెన్షన్ బామ్మ లక్ష.. ప్రేమ్‌జీ రూ.1125 కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

నేను సైతం.. పెన్షన్ బామ్మ లక్ష.. ప్రేమ్‌జీ రూ.1125 కోట్లు 

April 1, 2020

82 years Elderly woman donates pension money to Madhya Pradesh govt to fight covid-19

కరోనా మహమ్మారిపై యుద్దానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పలు కంపెనీలు, స్వచ్చంధ సంస్థలు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కి చెందిన 82 ఏళ్ళ వృద్ధురాలు త‌న ఔదార్యం చాటుకున్నారు. విదిశ జిల్లాలోని అరిహంత్ విహార్‌కు చెందిన స‌ల్బా ఉస్క‌ర్ రిటైర్డ్ ఉద్యోగిని. నెల‌నెలా వ‌చ్చే పెన్ష‌న్ డ‌బ్బులే ఆమెకు ఆధారం. కొంత డబ్బు ఖర్చుపెట్టి… మిగిలిన సొమ్మును పొదుపు చేసుకుంటున్నారు. అయితే కోవిడ్-19 పై ప్రభుత్వాలు చేస్తున్న పోరుకి త‌న వంతు సాయం చేయాల‌నుకున్నారు. ఈ క్రమంలో త‌న పెన్ష‌న్ డ‌బ్బుల్లోంచి ల‌క్ష రూపాయ‌లు విరాళంగా ప్రకటించారు. ఈ మేర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్‌ను అంద‌జేశారు. ఈ విషయాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్ చేస్తూ..’త‌ల్లీ నీకు వంద‌నం’ అని ప్రశంసించారు.

అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.1,125 కోట్లు..

అలాగే విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ కూడా తన వంతు విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ కలిసి రూ.1,125 కోట్ల సాయాన్ని విరాళంగా ప్రకటించారు. విప్రో తరఫున రూ.100కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ రూ.25కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తరఫున 1000 కోట్లను తమవంతు సాయంగా కేటాయించినట్లు విప్రో ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. విప్రో కంపెనీ సామాజిక బాధ్యత నిధి నుంచి కాకుండా అదనంగా ఈ సాయాన్ని ప్రకటించామని, అలాగే ఫౌండేషన్‌ సాధారణ దాతృత్వ ఖర్చులతో సంబంధం లేకుండా అదనంగా విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.