9 రోజుల పూల పండగ.. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ..  - MicTv.in - Telugu News
mictv telugu

9 రోజుల పూల పండగ.. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ.. 

October 16, 2020

9 Day flower festival Bathukamma 2020.. today Engili poola bathukamma ..

ఎప్పటిలానే ఈసారి కూడా తెలంగాణ బతుకమ్మ సంబరాలకు సిద్ధం అవుతోంది. ఓవైపు కరోనా వైరస్, మరోవైపు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అల్లకల్లోలంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా, వాన బీభత్సం చాలా కుటుంబాలలో విషాధాలను నింపాయి. ఇకనుంచైనా ఆ గౌరమ్మ తమను చల్లగా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. గునుగు, తంగేడు పూల, సీతాకుచ్చుల పూలతో బతుకమ్మలు పేర్చడానికి ఆడపడుచులు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఎమ్మెల్సీగా గెలిచిన కల్వకుంట్ల కవిత కూడా బతుకమ్మ సంబరాలకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఈసారి బతుకమ్మ పాటలు కూడా బాగానే వచ్చాయి. ఎటు చూసినా అమ్మలక్కలు, అన్నదమ్ములు పూలకోసం శివార్లకు పోతున్నారు. తీరొక్క జానపదాలు పడతుల కంఠంలో తియ్యగా జాలువారుతున్నాయి. ఊరూవాడ సంబురాలకు సిద్ఢం అవుతోంది. 9 రోజుల వరకు సాగే ఈ బతుకమ్మ పండగలో భాగంగా తొలిరోజు జరుపుకునే ఉత్సవం ‘ఎంగిలిపూల బతుకమ్మ’. శుక్రవారం (అక్టోబర్ 16) నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండగ వైభవంగా జరగుతుంది. నేడు మహా అమవాస్య కావడంతో  బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో దీన్ని పెత్తరమాస అని అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారుచేస్తారు. అలా రోజుకొక బతుకమ్మ సందర్భంగా నైవేద్యాలు మారుతుంటాయి.

పితృకార్యాలు నిర్వహించిన అనంతరం స్త్రీలు అందరూ భుజించాక బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చుతారు. కనుక దీనికి ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అనే పేరు వచ్చింది. అలాగే బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవిగా భావిస్తారు. పూలను కూడా అంతే పవిత్రంగా ఒకరోజు ముందే సేకరిస్తారు. అయితే పూలను బతుకమ్మగా పేర్చేటప్పుడు ఆ పూలకాడలు చేతులతో సమానంగా చించి వేయాలి. కత్తితో కోసినా, నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలై మలినమవుతాయి. ఇలా పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటినుంచి పెత్తరమాస సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారని ఓ ప్రతీతి. పెళ్లి కావాల్సిన వారు పండుగ తొలిరోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి వరుడు రావడంతో పాటు కలకాలం సౌభాగ్యంగా వెలసిల్లుతారని నమ్ముతారు. మరుసటి రోజు పాడ్యమి నుంచి మహిళలు అందరూ శుచీశుభ్రతతో రోజంతా ఉపవాసం పాటించి బతుకమ్మను పేర్చుతారు. ఆ తర్వాత రోజుల్లో వరుసగా అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండగ ఉత్సవాలు ముగుస్తాయి.