తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో మళ్లీ వానలు ముసురుకునే సరికి జనాలు భయం గుప్పిటలో ఉండిపోయారు. ఊళ్లల్లో మాత్రం బొడ్డెమ్మలను పేర్చి అమ్మలక్కలు బతుకమ్మలు ఆడుతున్నారు. 9 రోజుల బతుకమ్మ పండగ ఉత్సవాల్లో ఈరోజు మూడవరోజు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండోరోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. మూడో రోజైన నేడు ‘ముద్దపప్పు బతుకమ్మ’. మహిళలంతా పూల ఉత్సవానికి ఇవాళ కూడా సిద్ధమయ్యారు. అన్నదమ్ములు తెచ్చే పూలతో ముచ్చటైన బొడ్డెమ్మలు పేర్చుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు (ఆదివారం) మూడు ఎత్తుల్లో పూలను పేర్చి, శిఖరం మీద గౌరమ్మను ఉంచుతారు. చామంతి, మందార తదితర పూలతో చూడ చక్కగా తయారుచేస్తారు. గౌరమ్మకు ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా వ్యవహరిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మను పురస్కరించుకుని అమ్మ వారికి ముద్ద పప్పు , బెల్లం, పాలు కలిపిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మేలైనది. కాగా, పల్లెలన్నీ ఉయ్యాల పాటలు, కోలాటాల, గౌరమ్మ పూజలతో పరవశిస్తున్నాయి. బతుకమ్మ వేడుకలు ఇంటింటా కాస్త కళ తప్పాయనే చెప్పాలి. కరోనా నుంచి, ఈ వరదల నుంచి తమను రక్షించమని ఆడపడుచులందరూ గౌరమ్మను కోరుకుంటున్నారు.