9 people were killed in telangana road accident today
mictv telugu

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఒకేరోజు 9 మంది మృతి

November 3, 2022

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోచోట వికారాబాద్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం బ్రిడ్జి వద్ద ఆటోను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రగాయాలతో వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు.. హైదరాబాద్‌ తరలిస్తుండగా మరొకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయినవారిలో ఆటో డ్రైవర్ జమీల్‌, హేమ్లా, రవి, కిషన్, సోనీ భాయి ఉన్నారని.. వారంతా పెద్దేముల్ మండలం మదనంతాపూర్ వాసులని వివరించారు. కూలీ పనుల కోసం వికారాబాద్‌ వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏపీలోని పులివెందుల నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దివిటిపల్లి వద్దకు రాగానే అదుపుతప్తి బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులుండగా.. సుమారు 40 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 14 మంది క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.