తన పుట్టినిల్లయిన చైనాలో కరోనా విధ్వంసం రేపుతోంది. జనవరి 11 నాటికి ఆ దేశంలో 90 కోట్ల మందికి వైరస్ సోకింది. గాన్సూ ప్రావిన్స్ లో 91 శాతం మందికి, యునాన్ ప్రావిన్స్ లో 84 శాతం, కింఘాయ్ ప్రావిన్స్ లో 80 శాతం మందికి కోవిడ్ సోకిందని పెకింగ్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా వ్యాపించిన కరోనా.. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాలను ముద్దాడనుంది. జనవరి 23న చైనాలో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండడంతో పట్టణాల్లో స్థిరపడిన ప్రజలు.. పెద్ద ఎత్తున సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో అక్కడ కూడా కేసులు భారీగా పెరిగే అవకాశముంది. అప్రమత్తమైన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై దృష్టి సారించింది. అయితే పట్టణ ప్రాంతాల్లోనే బాధితులకు వైద్య సౌకర్యాలు అందించలేని అధికార యంత్రాంగం గ్రామీణ ప్రాంతాల్లో ఏమేరకు రక్షణ చర్యలు చేపడుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా ఇప్పుడిప్పుడే అంతం కాదని, కొత్త వేవ్ రెండు నుంచి మూడు నెలల వరకు కొనసాగుతుందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ చీఫ్ జెంగ్ గువాంగ్ తెలిపారు.