ఆరుగురు పిల్లలున్నా..91 ఏళ్ల వయస్సులోనూ వ్యవసాయం - MicTv.in - Telugu News
mictv telugu

ఆరుగురు పిల్లలున్నా..91 ఏళ్ల వయస్సులోనూ వ్యవసాయం

October 24, 2019

ప్రస్తుత సమాజంలో ఐదు పదుల వయస్సు వచ్చిందంటే చాలు లెక్కలేనన్ని జబ్బులు వస్తాయి. మోకాళ్ల నొప్పులు, అలసట చిన్న పనిచేసినా వెంటనే వచ్చేస్తుంటాయి. 60 ఏళ్లు దాటాయంటే చాలు సొంత పనులు చేసుకోవడం కూడా కొంత మందికి ఇబ్బందిగా మారుతుంది. కానీ 91 ఏళ్ల వయస్సులో కూడా ఓ రైతు ఎంతో చురుగ్గా పొలం పనులు చేస్తున్నారు. ఆయన నాగలి పట్టి వ్యవసాయం చేస్తుంటే చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

కర్నాటక రాష్ట్రంలోని కలబురగి ప్రాంతంలో  బసవనప్ప పాటిల్ అనే 91 ఏళ్ల రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతి రోజు పనులు చేస్తూనే ఉంటాడు. చిన్నతనం నుంచే వ్యవసాయం చేస్తున్నా ఏనాడు ఆయన అలసిపోలేదు. ఇప్పటికీ తన భూమిలో ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తూనే ఉంటాడు. ఆయన సొంతంగా నాగలి పట్టి దున్నడం, కలుపుతీయడం లాంటివి కూడా చూసుకుంటున్నాడు. ఆరోగ్యం సహకరించడం.. వ్యవసాయంపై ఉన్న మక్కువతోనే తాను ఇదంతా చేస్తున్నట్టు చెబుతున్నాడు. 

చాలా కాలం నుంచి తాను పాటించే ఆహారపు అలవాట్లే ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయని చెబుతున్నాడు. ఆయనకూ ఏనాడు కనీసం జ్వరం కూడా రాలేదని అంటున్నాడు. ప్రతి రోజు సమయం ప్రకారం ఉదయాన్నే స్వచ్ఛమైన  పాలు తాగడం.. రోటీ, అన్నం, పెరుగు తినడం చేస్తుంటాడట. గతంలో ఉన్న ఆహారపు అలవాట్ల వల్లే తన శరీరం ఇంకా సహకరిస్తుందని అంటున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే బసవప్పకు ఆరుగురు పిల్లలు ఉన్నా.. వీరిలో ఎవరూ వ్యవసాయ పనుల్లో పాలు పంచుకోలేదు. ఆయనే ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.