95th Oscar nominations: Kantara, Vikrant Rona films in nominations list
mictv telugu

ఆస్కార్ బరిలో ‘కాంతార’.. మొత్తం రెండు కేటగిరీల్లో.. విక్రాంత్ రోణ కూడా..

January 10, 2023

 95th Oscar nominations: Kantara, Vikrant Rona films in nominations list

చిన్న సినిమాగా వచ్చి గత ఏడాది సంచలన విజయం సాధించింది కన్నడ మూవీ ‘కాంతార’. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత పలు భాషల్లో రిలీజై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. కేజీఎఫ్ సిరీస్‌ను నిర్మించిన హోంబలే సంస్థ ‘కాంతార’ మూవీని నిర్మించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేయగా మంచి లాభాలను అందించింది.

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ని షేర్ చేసుకున్నారు హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీ ఆస్కార్స్‌లో రెండు కేట‌గిరీల్లో అర్హ‌త సాధించిన‌ట్లు రిష‌బ్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకోవ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌ని చెప్పారు. త‌మ‌కు స‌పోర్ట్ ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక ఆస్కార్స్ వేడుక‌ల్లోనూ ఈ ఫిల్మ్ మరింత మెరుస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు రిష‌బ్ త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.

మరో కన్నడ సినిమా ‘విక్రాంత్‌ రోణ’ కూడా ఆస్కార్‌ నామినేషన్ల బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చెబుతూ ఆ చిత్ర బృందం కూడా ట్వీట్‌ చేసింది. మొత్తంగా మన దేశం నుంచి 10 సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ‘ది ఛల్లో షో’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కశ్మీరీ ఫైల్స్‌’, ‘కాంతార’, ‘విక్రాంత్‌ రోణ’, ‘గంగూభాయి కతియావాడి’, ‘మి వసంతరావ్‌’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘రాకెట్రీ’, ‘ఇరవిన్‌ నిళల్‌’ సినిమాలు ఆస్కార్ కు అర్హత సాధించాయి. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరగనుంది. ఈ సారి ఆస్కార్‌ అవార్డుల్లో మన దేశ చిత్రాలు సత్తా చాటాలని నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.